సాక్షి, భద్రాచలం: భక్త రామదాసు 385వ జయంత్యుత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత భక్త రామదాసు చిత్రపటంతో భక్తుల కోలాటాల నడుమ నగర సంకీర్తనతో ఆలయం నుంచి గోదావరి నది వరకూ వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆలయం తరపున గోదారమ్మకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేసి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని భక్త రామదాసు విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసి గర్భగుడిలోని స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. చిత్రకూట మండపంలో సంగీత విద్వాంసులంతా ఒకేసారి రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేశారు. ఒక్కో కీర్తన మధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వివిధ ఫలాలు, పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహిస్తూ మంగళ హారుతులు ఇచ్చారు. కళాకారులను కృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు. కచేరీలు ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment