Bhadradri Temple
-
భద్రాద్రి రాముడికి ప్రభాస్ భారీ విరాళం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ప్రభాస్ తరపున యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి శనివారం అందించారు. అనంతరం ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ చిత్రం సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది. (చదవండి: కోపంతో నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టా.. హీరోయిన్) ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం తర్వలోనే విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించారు. గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. -
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు (ఫోటోలు)
-
రామ.. రామ! భద్రాద్రి ఈవో అత్యుత్సాహం.. ఆలయానికి ఒకరోజు తాళం
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో బుధవారం ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. వివరాలివి. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు. దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. చదవండి: ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి -
ప్రోటోకాల్ కంటే.. అది సంతోషానిచ్చింది: తమిళిసై
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడని గవర్నర్.. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. గతంలో గర్భిణులుకు పౌష్టికాహారం, వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించామని తెలిపారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు వారి బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించామని పేర్కొన్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్లే జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా మంది పౌష్టికాహారం లోపం, అనిమియాతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వారందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వెరీ హైజన్ ఉండే కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్‌భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. -
రాజాధిరాజుగా రామయ్య..
కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. వేద పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో రజత సింహాసనాన్నిఅధిష్టించారు. భక్తుల కరతాళధ్వనుల మధ్య.. రామనామ స్మరణ నడుమ.. రాజాధిరాజుగామురిసిపోయారు. వేడుకలను తిలకించేందుకువేలాదిగా వచ్చిన భక్తులు ఆ అపురూప ఘట్టాన్ని చూసి ధన్యులయ్యారు. చర్ల(భద్రాచలం): భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషిక్తుడయ్యారు. శిల్పకళా శోభితమైన మిథిలా స్టేడియం కల్యాణ మండపంలో సోమవారం కనుల పండువగా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణం జరిగిన మరుసటిరోజు శ్రీరామ పట్టాభిషేం నిర్వహించడం ఆనవాయితీ. ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని ఆ భాగ్యం ఒక్క శ్రీరామచంద్రుడికే ఉందని, పట్టాభిషేకం జరిగితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు తెలిపారు. అర్చక స్వాముల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ.. జై శ్రీ రాం.. జైజై శ్రీరాం.. అనే భక్తుల రామనామస్మరణతో మిథిలాస్టేడియం మార్మోగింది. తొలుత గర్భగుడిలో ప్రత్యేక పూజలందుకున్న తర్వాత భద్రగిరీశుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఆశీనులను చేసి గిరి ప్రదక్షణ చేయించారు. అనంతరం రామభక్తుల జయజయ ద్వానాల నడు మ మాఢ వీధుల్లో ఊరేగించారు. పట్టాభిషేక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు దంపతులు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకొని ఆలయం నుంచి స్వామి వారి ఊరేగింపులో పాల్గొని మిథిలా స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పకళా శోభితమైన మండపంపై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చక స్వా ములు పట్టాభిషేక కార్యక్రమానికి నాంది పలికారు. పట్టాభిషేకం... రామయ్యకే సొంతం ... ముక్కోటి దేవుళ్లలో ఒక్క శ్రీరాముడికి తప్ప మరెవ్వరికీ పట్టాభిషేక యోగం లేదని అర్చక స్వాములు తెలిపారు. తొలుత విశ్వక్సేన పూజ, వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలంటూ పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి మరుసటి రోజైన దశమిని దర్మరాజు దశమి అంటారని, ఈ రోజు మహాపట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు. పవిత్ర గోదావరి నదీ జలాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర, సహస్ర నామార్చన, సువర్ణ పుష్పాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించారు. మండపంలో పంచ కుండాత్మక పంచేష్టి సహిత చతుర్వేద హవన పురస్కృతంగా క్రతువును జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన రజత సింహాసనంపై శ్రీ సీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు. ఒక్కో ఆభరణాన్ని ధరింపజేస్తూ... పట్టాభిషేకం సందర్భంగా భక్తరామదాసు శ్రీ సీతారామచంద్రమూర్తులకు చేయించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా భక్తులకు చూపిస్తూ వాటి విశిష్టతను వివరిస్తూ స్వామి వారికి ధరింపజేశారు. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, బంగారు కిరీటాలను అలంకరింపజేశారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేదపండితులు వివరించారు. 60 ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతీ ఏటా కల్యాణం జరిగిన మరుసటి రోజు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోందని, భక్త రామదాసు కాలం నుంచీ ఇదే సంప్రదాయం కొనసాగుతోందని తెలియజేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించిన వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పారు. వేడుక పూర్తయిన తరువాత స్వామి వారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్య జలాలను భక్తులపై చల్లారు. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు... పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్యకు గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్న ఆయన తొలుత రామాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు పూజలు చేశారు. హాజరైన ప్రముఖులు వీరే ... మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి మహాపట్టాభిషేక కార్యాక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీ గౌతమ్ తదితరులు హాజరయ్యారు. నేడు రామయ్యకు మహదాశీర్వచనం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీసీతారాముల కల్యాణం జరిగిన రెండో రోజున రామయ్యకు దేశంలోని 508 మంది వేదపండితులచే మహదాశీర్వచనం చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, బాలభోగ నివేదన, హవనం, సేవాకాలం, బలిహరణం, మంగళాశాసనం నిర్వహిస్తారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు భద్రుని మండపంలో అభిషేకం, 12.30 నుంచి 1 గంట వరకు ఆరాధన, రాజభోగం జరుపుతారు. 3.30 నుంచి 6 గంటల వరకు వేదస్వస్తి, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహదాశ్వీరచనం, వేద సాహిత్య సదస్సు, హంస వాహన సేవ నిర్వహిస్తారు. -
రాబడి తగ్గింది..!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆదాయం గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది. ఆలయానికి రెగ్యులర్ ఈఓ ఉన్నప్పుడు.. ప్రముఖ భక్తులు ఎవరైనా వస్తే.. వారితో మాట్లాడడం, సరైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక పూజలు చేయించేవారు. అప్పుడు వారు హుండీలో వేసే కానుకలు కూడా భారీగానే ఉండేవి. ఇప్పుడు రెగ్యులర్ ఈఓ లేకపోవడమే ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో నెల రోజులకు ఒకసారి హుండీ లెక్కించేవారు. సుమారు రూ.75 లక్షల మేర ఆదాయం లభించేంది. రోజువారీగా స్వామివారికి అన్ని కార్యక్రమాలకు సంబంధించి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీనికి కారణం అధికారుల అలసత్వం, సరైన పర్యవేక్షణ లోపం, స్వామివారి కార్యక్రమాలపై సరైన ప్రచారం లేకపోవడం కారణమని భక్తులు అంటున్నారు. 102 రోజులకు రూ. 1.28 కోట్లు.. స్వామివారి హుండీలను సోమవారం ఆలయంలోని చిత్రకూట మండపంలో లెక్కించగా.. 102 రోజులకు గానూ రూ.1.28,45,721 లభించినట్లు ఆలయ ఈఓ పమెల సత్పథి తెలిపారు. ఈ ఆదాయంతో పాటు 513 యూఎస్ డాలర్లు, 50 యూఏఈ దినార్లు, 6 కువైట్ దినార్లు, 4సౌదీ రియాల్స్, 60 ఆస్ట్రేలియా డాలర్లు, 2 ఖతార్ రియాల్స్, 2 చైనా యాన్స్ లభించినట్లు తెలిపారు. స్వీపర్ చేతివాటం.. చర్యలకు రంగం సిద్ధం.. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో స్వీపర్ వెంకన్న చేతివాటం ప్రదర్శించి, రూ.3 వేలు తస్కరించాడు. మధ్యలో బయటకు వెళుతుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సోదా చేయగా అతని వద్ద రూ.3 వేలు దొరికాయి. వెంటనే ఈ విషయాన్ని ïఆలయ ఈఓ పమెల సత్పథికి, ఆలయ అధికారులకు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ ఈఓలు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు దగ్గర ఉండి హుండీల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇటీవల కాలంలో అధికారులు, సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి హుండీ లెక్కింపు కార్యక్రమం, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
వైభవం.. ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే ధ్వజారోహణంగా వ్యవహరిస్తారు. ఆలయంలో ఉదయం తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన చేశారు. కర్మణ, పుణ్యాహవచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన నిర్వహించారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్ని మథనం గావించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన జరిపి, హోమం చేశారు. గరుడాళ్వార్లకు ప్రత్యేక ఆహ్వానం.. ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవ మూర్తులైన శ్రీసీతారామ లక్ష్మణ స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షణ చేయించి ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జరిపి అర్చక, పరిచారక, వేద పండితులు తీసుకొని రాగా.. బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించగా, మంగళ వాయిద్య ఘోష నడుమ గరుడ పటాన్ని పైకి ఎగురవేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లేని వారికి గరుడ ముద్దలను అందజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దీంతో ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలక, దేవతాహ్వానం గావించారు. ఉత్సవ మూర్తులతో పాటు ఎనిమిది దిక్కులకు బలిహరణం వేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రబాకర శ్రీనివాస్ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇతర అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఎదుర్కోలు ఉత్సవం... స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎదుర్కోలు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం చతుఃస్థానార్చన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం గరుడ సేవ జరపనున్నారు. -
అటకెక్కినట్టేనా..?!
నేలకొండపల్లి : భద్రాచలం దేవస్థానం నిర్మాత.. పరమ భకాగ్రేసరుడు రామదాసు స్వస్థలంలో మహాద్వార నిర్మాణంపై భద్రాద్రి దేవస్థానం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రామదాసు పుట్టిన గడ్డ నేలకొండపల్లిలో రామదాసు మహాద్వారం నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించి, హడావుడిగా మంత్రితో శంకుస్థాపన చేయించింది. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఇప్పటివరకు అక్కడ ఆవగింజంత పని కూడా చేపట్టలేదు. ‘భక్త రామదాసుకు ఇచ్చే మర్యాద ఇదేనా అని రామదాసు భక్తులు మండిపడుతున్నారు..... భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించినందుకుగాను చెరసాలలో గడిపిన కంచర్ల రామదాసు(గోపన్న)ను భద్రాచలం అధికారులు అవమానిస్తున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతరత్రా కార్యక్రమాలకు ఎలాగూ సహకరించటం లేదు. రామదాసు భక్తుల కోరిక మేరకు భద్రాద్రి అధికారులు మహాద్వారం కోసం రూ.2.50 లక్షలను మంజూరు చేశారు. రామదాసు పేరున నేలకొండపల్లి ప్రధాన మహాద్వారం నిర్మించేందుకు 2011, నవంబర్ 17 న అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో భద్రాద్రి దేవస్థానం అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, హడావుడిగా శంకుస్థాపన చేయించారు. నేటి వరకు అక్కడ చిన్న పని కూడా చేయలేదు. రామదాసు మందిరంలో కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదు. మహాద్వార నిర్మాణాన్ని విస్మరించారు. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీరుపై రామదాసు భక్తులు మండిపడుతున్నారు. ఇక్కడి రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇటీవల ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మహాద్వారం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. -
రామయ్యను దర్శించుకున్న ఇస్రో డైరెక్టర్
భద్రాచలం : శ్రీ సీతారామచంద్రస్వామి వారిని హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ఎస్సీ అండ్ ఇస్రో డైరెక్టర్ డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ, అభయాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
సారొస్తారా..?
ప్రతి ఏటా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తేవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భద్రాచలం వస్తారా? రారా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. స్వరాష్ట్రం వచ్చాక ఇది నాలుగో కల్యాణం. గత మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే సీఎం హాజరయ్యారు. భద్రాచలం : భద్రాద్రి రాములోరి పెళ్లికి మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 26న జరిగే కల్యాణం, మరుసటి రోజు మహా పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలకు 1.50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కల్యాణానికి వస్తారని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కానీ సీఎం పర్యటనపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనేకమార్లు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. ఆలయ పునఃనిర్మాణానికి దేవాదాయశాఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి నేతృత్వంలో డిజైన్ కూడా సిద్ధమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం ఇటీవల పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగక పోవడంతో ముఖ్యమంత్రి రాకపై సర్వత్రా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది నాలుగో కల్యాణం. ఇది వరకు రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాములోరి పెళ్లికి వచ్చి ఆలయాబివృద్ధికి ఇక్కడేమి మాట్లాడకుండానే ఇక్కడి నుంచి మణుగూరుకు వెళ్లి అక్కడ ప్రకటన చేశారు. అటు తరువాత జరిగిన కల్యాణానికి (గత ఏడాది కల్యాణానికి) ముఖ్యమంత్రి హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం రాకపోతే రాములోరి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు తీసుకొస్తారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. మావోయిస్టు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. గత నెలలో సరిహద్దు ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గల పూజారికాంకేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు మరుసటి రోజే ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాక్షాత్తు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆడియో టేపును విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. ఆ తరువాత నుంచి వరుస విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రభావం భద్రాచలం పట్టణంపై కూడా పడింది. కొత్తగూడెం ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను ఇటీవల భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనతో మావోయిస్టు కార్యకలాపాలు పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలుస్తుండగా, మావోయిస్టులు పట్టణ ప్రాంతాలలో కూడా కొరియర్లను ఏర్పాటు చేసుకుని వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్దలు వస్తుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ అంబర్కిశోర్ఝూ నిఘా విభాగం అధికారులతో గురువారం భద్రాచలంలో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకున్నది. సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన ఈ సారి రాములోరి కల్యాణానికి వస్తారా? రూ. 100 కోట్లతో చేపట్టనున్న అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారా? అనేదానిపై మీమాంస నెలకొంది. -
నవమికి తుదిరూపు
భద్రాచలం : శ్రీరామనవమికి నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి తుదిరూపు కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు యాదాద్రిలా తీర్చిదిద్దేందుకు ఆర్కిటెక్ట్ ఆనందసాయిని నియమించారు. శుక్రవారం మంత్రి తుమ్మలకు ఆనందసాయి ఆలయ అభివృద్ధి ప్లాన్లను చూపించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన భద్రాద్రి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా ఆర్కిటెక్ట్ ఆనందసాయితో తుమ్మల మూడు నమూనాలను తయారు చేయించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఈ మూడు నమూనాలు చక్కగా కుదిరాయని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముఖ్యమంత్రి సమక్షంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తుమ్మల తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా శ్రీ రామనవమి లోపు కొన్ని అభివృద్ధి పనులు మొదలు పెట్టి వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ అభివృద్ధికి తుది రూపు కల్పిస్తామని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని తుది నమూనాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
రామదాసు కీర్తనలతో ఓలలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాచలం: భక్త రామదాసు 385వ జయంత్యుత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత భక్త రామదాసు చిత్రపటంతో భక్తుల కోలాటాల నడుమ నగర సంకీర్తనతో ఆలయం నుంచి గోదావరి నది వరకూ వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆలయం తరపున గోదారమ్మకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేసి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని భక్త రామదాసు విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసి గర్భగుడిలోని స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. చిత్రకూట మండపంలో సంగీత విద్వాంసులంతా ఒకేసారి రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేశారు. ఒక్కో కీర్తన మధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వివిధ ఫలాలు, పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహిస్తూ మంగళ హారుతులు ఇచ్చారు. కళాకారులను కృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు. కచేరీలు ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో అపచారం
భద్రాద్రిలో లక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు మూయని అర్చకులు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడి ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మవారి కోవెల తలు పులను శుక్రవారం రాత్రి మూయకుండానే వదిలేశారు. రాత్రి వేళ విధుల్లో ఉన్న సెక్యూరిటీ(ఎస్టీఎఫ్)సిబ్బంది దీనిని గుర్తించి, తెల్లవార్లూ అక్కడనే కాపలా కాయాల్సి వచ్చింది. భద్రాద్రి రామాలయ తలుపులు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు మూస్తారు. గర్భగుడి తలుపులతో పాటు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా ఇదే సమయంలో మూస్తారు. అయితే శుక్రవారం రాత్రి విధు ల్లో ఉన్న అర్చకుడు పూజాది కార్యక్రమాల అనంతరం లక్ష్మి అమ్మవారి కోవెల ప్రధాన తలుపులు వేయకుండా బయట గేట్లును వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం(రాజగోపురం) తలుపులు కూడా వేసి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత ఆలయం లోపల విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, దీనిపై ఆలయ అర్చకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి కావటంతో ఆ సమయంలో ఎవరూ అందుబాటులోకి రాలేదని ఎస్టీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తీసిన సమయంలో ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ సిబ్బంది ఆలయ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం విధులకు హాజరైన అర్చకులు సంప్రోక్షణ అనంతరం తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శేఖర్ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అర్చకుడికి మెమో జారీ చేస్తాం లక్ష్మి తాయారు అమ్మవారి కోవెల తలుపులు శుక్రవారం రాత్రి వేయకుండా వదిలేసిన విషయమ వాస్తవమే. దీనిపై ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడికి మెమో జారీ చేస్తాం. ఎందుకిలా జరిగిందనే దానిపై ఆయన వివరణ కోరుతాం. ఆయన ఇచ్చిన సమాధానం అనంతరం ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను. – ఈఓ ప్రభాకర శ్రీనివాస్ -
రామా.. ఎంత అపచారం!
మూలవరులను తాకిన భక్తులు భద్రాచలం: భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లి, స్వామి మూర్తులను తాకినట్లుగా తెలిసింది. గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లకూడదనే విషయం తెలియని సదరు భక్తులు, స్వామి సేవలో తరించాలనే అలా చేసి ఉంటారని ఆలయన అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి ఆలయంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో విధులు నిర్వహించే అర్చకులు అక్కడ లేకపోవడం గమనార్హం. విషయాన్ని కొంతమంది భక్తులు ఈవో రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్చకులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఈవో తెలిపారు. -
భద్రాది రామాలయంలో ఆభరణాల తనిఖీ
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని బంగారు ఆభరణాలను దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి భాస్కర్ మంగళవారం తనిఖీ చేశారు. సీతమ్మ మంగళ సూత్రం, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ మాయమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆలయంలోని మొత్తం ఆభరణాల లెక్క తేల్చాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జేవీవో భాస్కర్ బంగారు ఆభరణాలను పరిశీలించారు. ఆలయ ఈవో రమేష్‌బాబుతోపాటు అర్చకుల సమక్షంలో గర్భ గుడిలోని ప్రత్యేక బీరువాలోని ఆభరణాలను బయటకు తీశారు. అందుబాటులో ఉన్న నివేదిక ఆధారంగా ఒక్కో బంగారు ఆభరణాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారి భాస్కర్ మాట్లాడుతూ... బంగారు ఆభరణాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆభరణాల మాయంపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రాచలం సీఐ శ్రీనివాసులు ఆలయాన్ని సందర్శించి.. కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే ప్రదేశంతోపాటు ఆలయంలో సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో రమేష్‌బాబుతో సీఐ చర్చించారు. అర్చకులు, సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవంగా భద్రాద్రి ఆలయంలో 50 కేజీల బంగారం, 750 కేజీల వెండి ఉంది. అయితే అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న బంగారు ఆభరణాలనే ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. మొత్తం పరిశీలించినట్లు అయితే స్వామి వారి బంగారం భద్రంగా ఉందా లేదా అనే అంశం తేలనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
13న భద్రాచలంలో లక్ష దీపోత్సవం
భద్రాచలం: భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 13న అరుదైన వేడుకను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియం(కల్యాణమండపం) ప్రాంగణంలో కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించ తలపెట్టిన ఈ ఉత్సవానికి అయ్యే వ్యయాన్ని బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ రోజు రామాలయ ప్రాంగణమంతా కార్తీక దీపాలతో అలంకరించనున్నారు. దర్బార్ సేవ జరిగే ఉత్సవ మంటపాన్ని కూడా ప్రత్యేకంగా దీపాలంకరణ చేయనున్నారు. ఇందుకోసమని 50 వేల ప్రమిదలను, లక్ష వత్తులను, దీపాలను వెలిగించేందుకు నూనె వంటి వస్తువులను నిర్వాహకులే అందజేయనున్నారు. కల్యాణ మండపంలో దీపాలంకరణ కోసం 24 గ్రూపుల(దళం)ను ఎంపిక చేయనున్నారు. ఒక్కో గ్రూపులో 12 మంది మహిళలు ఉంటారు. ఎంపిక చేసిన దళాలను దేవతా మూర్తుల పేర్లతో నమోదు చేసుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు ఈ జరిగే ఈవేడుకలో అధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రికి భక్తులను రప్పించడమే లక్ష్యం.. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి, తద్వారా దివ్యక్షేత్రానికి భక్తులను రప్పించటమే లక్ష్యంగా ఈ అరుదైన వేడుకను నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమని దేవస్థానం ఈఓ కూరాకుల జ్వోతి, ఏఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. దీపోత్సవంలో పాల్గొనే మహిళా టీమ్‌లకు వారి ప్రతిభకు గుర్తింపుగా బహుమతులను కూడా అందజేసేందుకు ఫౌండేషన్ వారు ముందుకొచ్చారని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు విలువ గల వెండితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమ, పీఠాలను అందజేయనున్నట్లుగా చెప్పారు. వేడుకలో పాల్గొనే టీమ్‌లలో సభ్యులందరికీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి చిత్రాలను అందజేస్తామన్నారు. 9లోగా నమోదు చేసుకోవాలి.. భద్రాద్రి క్షేత్రంలో జరిగే లక్ష దీపోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులు పాల్గొనవచ్చు. ఇందుకోసం టీమ్‌లుగా ఏర్పడి ఈ నెల 9లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని దేవస్థానం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం దేవస్థానం ఉద్యోగులకు చెందిన 76600 07679, 76600 07684 సెల్ నంబర్ర్లలో సంప్రదించాలని కోరారు.