ప్రతి ఏటా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తేవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భద్రాచలం వస్తారా? రారా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. స్వరాష్ట్రం వచ్చాక ఇది నాలుగో కల్యాణం. గత మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే సీఎం హాజరయ్యారు.
భద్రాచలం : భద్రాద్రి రాములోరి పెళ్లికి మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 26న జరిగే కల్యాణం, మరుసటి రోజు మహా పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలకు 1.50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కల్యాణానికి వస్తారని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
కానీ సీఎం పర్యటనపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనేకమార్లు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఆలయ పునఃనిర్మాణానికి దేవాదాయశాఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి నేతృత్వంలో డిజైన్ కూడా సిద్ధమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం ఇటీవల పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగక పోవడంతో ముఖ్యమంత్రి రాకపై సర్వత్రా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది నాలుగో కల్యాణం. ఇది వరకు రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాములోరి పెళ్లికి వచ్చి ఆలయాబివృద్ధికి ఇక్కడేమి మాట్లాడకుండానే ఇక్కడి నుంచి మణుగూరుకు వెళ్లి అక్కడ ప్రకటన చేశారు. అటు తరువాత జరిగిన కల్యాణానికి (గత ఏడాది కల్యాణానికి) ముఖ్యమంత్రి హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం రాకపోతే రాములోరి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు తీసుకొస్తారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
మావోయిస్టు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తత
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. గత నెలలో సరిహద్దు ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గల పూజారికాంకేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు మరుసటి రోజే ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాక్షాత్తు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆడియో టేపును విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. ఆ తరువాత నుంచి వరుస విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రభావం భద్రాచలం పట్టణంపై కూడా పడింది. కొత్తగూడెం ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను ఇటీవల భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనతో మావోయిస్టు కార్యకలాపాలు పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలుస్తుండగా, మావోయిస్టులు పట్టణ ప్రాంతాలలో కూడా కొరియర్లను ఏర్పాటు చేసుకుని వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది.
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్దలు వస్తుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝూ నిఘా విభాగం అధికారులతో గురువారం భద్రాచలంలో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకున్నది. సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన ఈ సారి రాములోరి కల్యాణానికి వస్తారా? రూ. 100 కోట్లతో చేపట్టనున్న అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారా? అనేదానిపై మీమాంస నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment