
భద్రాచలం : శ్రీరామనవమికి నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి తుదిరూపు కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు యాదాద్రిలా తీర్చిదిద్దేందుకు ఆర్కిటెక్ట్ ఆనందసాయిని నియమించారు. శుక్రవారం మంత్రి తుమ్మలకు ఆనందసాయి ఆలయ అభివృద్ధి ప్లాన్‌లను చూపించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన భద్రాద్రి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా ఆర్కిటెక్ట్ ఆనందసాయితో తుమ్మల మూడు నమూనాలను తయారు చేయించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఈ మూడు నమూనాలు చక్కగా కుదిరాయని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముఖ్యమంత్రి సమక్షంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తుమ్మల తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా శ్రీ రామనవమి లోపు కొన్ని అభివృద్ధి పనులు మొదలు పెట్టి వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ అభివృద్ధికి తుది రూపు కల్పిస్తామని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకొని తుది నమూనాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment