మహాద్వారానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి వెంకటరెడ్డి (ఫైల్)
నేలకొండపల్లి : భద్రాచలం దేవస్థానం నిర్మాత.. పరమ భకాగ్రేసరుడు రామదాసు స్వస్థలంలో మహాద్వార నిర్మాణంపై భద్రాద్రి దేవస్థానం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రామదాసు పుట్టిన గడ్డ నేలకొండపల్లిలో రామదాసు మహాద్వారం నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించి, హడావుడిగా మంత్రితో శంకుస్థాపన చేయించింది. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఇప్పటివరకు అక్కడ ఆవగింజంత పని కూడా చేపట్టలేదు. ‘భక్త రామదాసుకు ఇచ్చే మర్యాద ఇదేనా అని రామదాసు భక్తులు మండిపడుతున్నారు.....
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించినందుకుగాను చెరసాలలో గడిపిన కంచర్ల రామదాసు(గోపన్న)ను భద్రాచలం అధికారులు అవమానిస్తున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతరత్రా కార్యక్రమాలకు ఎలాగూ సహకరించటం లేదు. రామదాసు భక్తుల కోరిక మేరకు భద్రాద్రి అధికారులు మహాద్వారం కోసం రూ.2.50 లక్షలను మంజూరు చేశారు. రామదాసు పేరున నేలకొండపల్లి ప్రధాన మహాద్వారం నిర్మించేందుకు 2011, నవంబర్ 17 న అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో భద్రాద్రి దేవస్థానం అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, హడావుడిగా శంకుస్థాపన చేయించారు.
నేటి వరకు అక్కడ చిన్న పని కూడా చేయలేదు. రామదాసు మందిరంలో కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదు. మహాద్వార నిర్మాణాన్ని విస్మరించారు. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీరుపై రామదాసు భక్తులు మండిపడుతున్నారు. ఇక్కడి రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇటీవల ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మహాద్వారం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment