endoment deportment
-
Telangana: గుడి గోల్డ్.. బాండ్స్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో 800 కిలోల బంగారు నిల్వలు, దాదాపు 3,750 కిలోల వెండి నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో నిత్య కైంకర్యాలు, ప్రత్యేక రోజుల్లో దేవుళ్ల అలంకరణకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలు మినహా కానుకల రూపంలో భక్తులు స్వల్ప మొత్తాల్లో సమర్పించే బంగారం, వెండిని వాడటం లేదు. కానీ వాటిని ఆలయాల్లోనే భద్రపరచడం క్షేమం కాదని భావించి బ్యాంకు లాకర్లలో ప్రభుత్వం భద్రపరుస్తోంది. ఇందుకు దేవాదాయ శాఖ లాకర్ చార్జీలు చెల్లిస్తోంది. కొన్నింటికి బీమా చేయించినందున.. బీమా ప్రీమియం సైతం కడుతోంది. వెరసి వినియోగంలో లేని ఆభరణాలు, బంగారు, వెండి ముక్కల వల్ల ఎలాంటి ఆదాయం లేకపోగా ఖర్చే మిగులుతోంది. దీంతో ఆయా ఆలయాల్లో వినియోగించని నగలు, బంగారు, వెండిని (కిలోకన్నా ఎక్కువగా ఉంటేనే) గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించిన దేవదాయ శాఖ... ఆ మేరకు ఆలయాలవారీగా ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం బంగారాన్ని కరిగించి 95 శాతం స్వచ్ఛత స్థాయికి తెచ్చి ఆ రోజు బంగారు ధర ప్రకారం స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలోని గోల్డ్ డిపాజిట్ పథకంలో చేరుస్తోంది. దాని విలువ మేరకు ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తోంది. ఈ మొత్తంపై బ్యాంకు 2.25 శాతం వడ్డీని ఆయా ఆలయాలకు చెల్లించనుంది. బంగారం, వెండి కరిగింపు చార్జీలను సైతం బ్యాంకే భరిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఎఫ్డీని కొనసాగించొచ్చు. కాదంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని దేవాలయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఇప్పటికే బాసర, వేములవాడ, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, ఉజ్జయినీ మహంకాళి, కొండగట్టు, కొమురవెల్లి ఆలయాలకు చెందిన బంగారం డిపాజిట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇక వెండిని కూడా కరిగించి దాన్ని మేలిమి బంగారం విలువతో లెక్కించి ఆ మేరకు నగదులోకి మార్చి బ్యాంకు డిపాజిట్ చేయించుకుంటోంది. -
టీటీడీ ప్రత్యేక అధికారి ఇక అదనపు ఈవో!
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రత్యేక అధికారి పోస్టును ఇక నుంచి.. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై 30 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అయ్యారే.. అయ్యన్న!
సాక్షి, మంత్రాలయం: అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఆయన తలచుకుంటే చట్టాలు ఎన్ని ఉన్నా దిగదుడుపే. అధికార అండతో ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారు. టెండర్లు లేకుండానే దుకాణాలు బాడుగకు కట్టబెట్టారు. ఇవి చాలదన్నట్లు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ప్రారంభించారు. కోసిగి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ నాడిగేని అయ్యన్న నిర్వాకాలివీ..ఈ లయానికి రూ.కోట్లు విలువజేసే భూములు ఉన్నాయి. ఇందులో మండల కేంద్రం నడిబొడ్డున తేరుబజారులో సర్వేనంబర్ 167, 168లో ఉన్న దాదాపు 1.50 పొలం కూడా ఒకటి. ఈ పొలంలో బంకులను తొలగించి ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. 150 దుకాణాలు, ఆపై భవనాన్ని కట్టించారు. గతంలో బంకులు వేసుకున్న వ్యాపారులతో దుకాణానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసి..వారికి బాడుగకు ఇచ్చారు. ఇందుకు దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కనీసం ఎండోమెంట్ ఇంజినీర్ల అప్రూవల్ సైతం లేదు. దుకాణాల సముదాయంపై కొందరు కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. అయితే.. ట్రస్టుబోర్డు చైర్మన్ అయ్యన్న స్టేను ధిక్కరించి అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. ఏకంగా ఎండోమెంట్ దుకాణాల సముదాయంపై టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శనివారం ఈ కార్యాలయాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డితో ప్రారంభింపజేశారు. నిబంధనలకు పాతర వాస్తవానికి ఎన్నికల నియమం ప్రకారం ఆధ్యాత్మిక, విద్యాసంస్థల్లో ఎలాంటి పార్టీ కార్యాయాలు, కార్యకలాపాలు నిర్వహించరాదు. ఇవేమీ పట్టని అయ్యన్న పార్టీ కార్యాలయం ప్రారంభించి తన దర్జాను ప్రదర్శించారు. అలాగే ఎండోమెంట్ నిబంధనల ప్రకారం దేవదాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా అనుమతులు ఉండాలి. ఇతరులకు బాడుగకు ఇచ్చుకోవాలంటే బహిరంగ వేలం నిర్వహించాలి. ఇక్కడ ఇవేమీ చేయలేదు. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ విషయమై అయ్యన్నను వివరణ అడగ్గా.. దుకాణం మహదేవప్ప పేరుపై ఉందని, నెలకు రూ.2 వేల బాడుగ, రూ.2 లక్షలు అడ్వాన్సు తీసుకుని పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ‘నిబంధనలు లేకుండానే పార్టీ కార్యాలయం ప్రారంభించాం. దుకాణాలు కట్టించాం. బాడుగలకు కూడా ఇచ్చాం. ఏమైనా రాసుకోండి’ అంటూ బరి తెగింపు ప్రదర్శించారు. అనుమతులు ఇవ్వం టీడీపీ కార్యాలయం ప్రారంభించినట్లు మా దృష్టికి రాలేదు. ఎండోమెంట్ దుకాణాల్లో ఏవైనా బాడుగకు ఇవ్వాలంటే కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. ఇష్టానుసారంగా ఇవ్వడం చట్టరీత్యా నేరం. ముఖ్యంగా పార్టీ కార్యాలయాలు, కార్యకలాపాలను ఆలయాలు, దుకాణాలు, సముదాయాల్లో నిర్వహించడానికి వీలు లేదు. నిబంధనల విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తీసుకుంటాం. – దేములు, డిప్యూటీ కమిషనర్, దేవదాయ శాఖ, కర్నూలు -
అటకెక్కినట్టేనా..?!
నేలకొండపల్లి : భద్రాచలం దేవస్థానం నిర్మాత.. పరమ భకాగ్రేసరుడు రామదాసు స్వస్థలంలో మహాద్వార నిర్మాణంపై భద్రాద్రి దేవస్థానం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రామదాసు పుట్టిన గడ్డ నేలకొండపల్లిలో రామదాసు మహాద్వారం నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించి, హడావుడిగా మంత్రితో శంకుస్థాపన చేయించింది. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఇప్పటివరకు అక్కడ ఆవగింజంత పని కూడా చేపట్టలేదు. ‘భక్త రామదాసుకు ఇచ్చే మర్యాద ఇదేనా అని రామదాసు భక్తులు మండిపడుతున్నారు..... భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించినందుకుగాను చెరసాలలో గడిపిన కంచర్ల రామదాసు(గోపన్న)ను భద్రాచలం అధికారులు అవమానిస్తున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతరత్రా కార్యక్రమాలకు ఎలాగూ సహకరించటం లేదు. రామదాసు భక్తుల కోరిక మేరకు భద్రాద్రి అధికారులు మహాద్వారం కోసం రూ.2.50 లక్షలను మంజూరు చేశారు. రామదాసు పేరున నేలకొండపల్లి ప్రధాన మహాద్వారం నిర్మించేందుకు 2011, నవంబర్ 17 న అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో భద్రాద్రి దేవస్థానం అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, హడావుడిగా శంకుస్థాపన చేయించారు. నేటి వరకు అక్కడ చిన్న పని కూడా చేయలేదు. రామదాసు మందిరంలో కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదు. మహాద్వార నిర్మాణాన్ని విస్మరించారు. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీరుపై రామదాసు భక్తులు మండిపడుతున్నారు. ఇక్కడి రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇటీవల ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మహాద్వారం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. -
ఆలయాలపై ఆశలు
29 దేవాలయాలకు పాలక మండళ్లు నోటిఫికేషన్ జారీచేసిన దేవాదాయ శాఖ దరఖాస్తులకు 20 రోజులు గడువు పదవుల కోసం నేతల ప్రయత్నాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆలయాల ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. రాష్ట్రస్థాయి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతర, కురవిలోని వీరభద్రస్వామి, వరంగలోని భద్రకాళి, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి, వర్ధన్నపేట మండలం ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయాలకు ధర్మకర్తల కమిటీ నియామకం కోసం దేవాదాయ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవే కాకుండా జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన 29 ఆలయాలకు ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం మంగళవారం(30న) మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమితులు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ జారీ చేసిన 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వరుస నోటిఫికేషన్లతో అధికార పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా నియమితులై, చైర్మన్ పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. దేవాలయాల ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులు చేసింది. గతంలో రెండేళ్లు ఉన్న పదవీకాలాన్ని ఏడాదిగా నిర్ణయించింది. అన్ని కేటగిరీ ఆలయాల ధర్మకర్తల కమిటీల్లోని సభ్యుల సంఖ్యను పెంచింది. వార్షిక ఆదాయం ప్రామాణికంగా దేవాలయాలను నాలుగు కేటగిరీలుగా దేవాదాయ శాఖ పరిగణిస్తుంది. రూ.2 లక్షలలోపు ఆదాయం, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఆదాయం, రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలలోపు ఆదాయం, కోటి రూపాయలకుపైగా ఆదాయం కేటగిరీలుగా ఆలయాలు ఉంటాయి. కోటి రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు 14 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమిస్తారు. రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్న ఆలయాలకు ఏడుగురు, రెండు లక్షల రూపాయల నుంచి రూ.25 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఉంటుంది. మంగళవారం వచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్న ఆలయాలు నియోజకవర్గాల వారీగా... ములుగు : శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామప్ప), శ్రీముసలమ్మ జాతర(గుంజేడు) వరంగల్ తూర్పు : కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం(స్టేషన్‌రోడ్), శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానం(ఉర్సు), శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీదుర్గేశ్వరస్వామి దేవాలయం(గిర్మాజీపేట), శ్రీభోగేశ్వరస్వామి దేవాలయం(మట్టెవాడ) వరంగల్ పశ్చిమ : శ్రీరుద్రేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ), శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ) స్టేషన్‌ఘన్‌పూర్ : శ్రీబుగులు వెంకటేశ్వస్వామి దేవాలయం(చిల్పూరు), శ్రీరామచంద్రస్వామి దేవస్థానం(జీడికల్), గట్టు మల్లికార్జునస్వామి దేవాలయం(మల్లికుదుర్ల), శ్రీకోదండరామస్వామి దేవాలయం(నవాబుపేట) డోర్నకల్ : శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(మరిపెడ), శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(నర్సింహులపేట). పరకాల : శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొమ్మాల), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(మల్లక్కపేట), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(అగ్రంపహాడ్), శ్రీకట్టమల్లన్నస్వామి దేవాలయం(గొర్రెకుంట), శ్రీకుంకుమేశ్వరస్వామి దేవాలయం(పరకాల) మహబూబాబాద్ : శ్రీచంద్రమౌలేశ్వరస్వామి దేవాలయం(మహబూబాబాద్), శ్రీరామ మందిరం(మహబూబాబాద్) భూపాలపల్లి : శ్రీబుగులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం(తిరుమలగిరి), శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొడవటంచ), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(మొగుళ్లపల్లి), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(భూపాలపల్లి) జనగామ : శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(కొడవటూరు) వర్ధన్నపేట : శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(దామెరగుట్ట) -
రేపు జిల్లాలో ‘హరిత ప్రసాదం’
కడప కల్చరల్: జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అంతటా హరితప్రసాదం పేరిట భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ శాఖ అసిస్టెంట్‌కమిషనర్ శంకర్ బాలాజీ తెలిపారు.బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో ఎంపికచేసిన 136 దేవాలయాల ప్రాంగణాలు, ఆలయ భూములలో మొత్తం 13,600 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 మంది ఈఓలు ఇప్పటికే తమ పరిధిలోని ఆలయాలలో ఈకార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లలో ఉన్నారని, స్థానికుల సహకారంతో మొక్కలు నాటేందుకుఅవసరమైన వాటిని సిద్ధం చేశారన్నారు. వీలున్న ప్రతి ఆలయం వద్ద 50 నుంచి 500 మొక్కలనునాటాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా పాలకొండల్లో ఎక్కువ మొక్కలను నాటాలని భావిస్తున్నామని, పొలతలలో 400, సీకే దిన్నెలో 200, ఇంకా ఆరుబయలున్న ఆలయాల వద్ద భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పరిసరాలతోపాటు సమీపంలోఉన్న ఆలయ భూములలో కూడా మొక్కలు నాటుతామన్నారు. శుక్రవారం ఆయా దేవాలయాలకువచ్చే భక్తులకు కూడా మొక్కలను హరిత ప్రసాదంగా అందజేయనున్నామని తెలిపారు. ఆ తర్వాత కూడా భక్తులకు మొక్కలను అందజేసేందుకు నర్సరీలతో సంప్రదిస్తామని, అవసరమైతే తమ శాఖ ఆ«ధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇందులో భాగంగా తులసి, మద్ది,మారేడు, ఉసిరి, వేప, బిల్వ, జమ్మి మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.