కోసిగి ఆంజనేయ స్వామి ఆలయ సముదాయంపై ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయం
సాక్షి, మంత్రాలయం: అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఆయన తలచుకుంటే చట్టాలు ఎన్ని ఉన్నా దిగదుడుపే. అధికార అండతో ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారు. టెండర్లు లేకుండానే దుకాణాలు బాడుగకు కట్టబెట్టారు. ఇవి చాలదన్నట్లు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ప్రారంభించారు. కోసిగి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ నాడిగేని అయ్యన్న నిర్వాకాలివీ..ఈ లయానికి రూ.కోట్లు విలువజేసే భూములు ఉన్నాయి. ఇందులో మండల కేంద్రం నడిబొడ్డున తేరుబజారులో సర్వేనంబర్ 167, 168లో ఉన్న దాదాపు 1.50 పొలం కూడా ఒకటి. ఈ పొలంలో బంకులను తొలగించి ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. 150 దుకాణాలు, ఆపై భవనాన్ని కట్టించారు.
గతంలో బంకులు వేసుకున్న వ్యాపారులతో దుకాణానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసి..వారికి బాడుగకు ఇచ్చారు. ఇందుకు దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కనీసం ఎండోమెంట్ ఇంజినీర్ల అప్రూవల్ సైతం లేదు. దుకాణాల సముదాయంపై కొందరు కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. అయితే.. ట్రస్టుబోర్డు చైర్మన్ అయ్యన్న స్టేను ధిక్కరించి అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. ఏకంగా ఎండోమెంట్ దుకాణాల సముదాయంపై టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శనివారం ఈ కార్యాలయాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డితో ప్రారంభింపజేశారు.
నిబంధనలకు పాతర
వాస్తవానికి ఎన్నికల నియమం ప్రకారం ఆధ్యాత్మిక, విద్యాసంస్థల్లో ఎలాంటి పార్టీ కార్యాయాలు, కార్యకలాపాలు నిర్వహించరాదు. ఇవేమీ పట్టని అయ్యన్న పార్టీ కార్యాలయం ప్రారంభించి తన దర్జాను ప్రదర్శించారు. అలాగే ఎండోమెంట్ నిబంధనల ప్రకారం దేవదాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా అనుమతులు ఉండాలి. ఇతరులకు బాడుగకు ఇచ్చుకోవాలంటే బహిరంగ వేలం నిర్వహించాలి. ఇక్కడ ఇవేమీ చేయలేదు. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ విషయమై అయ్యన్నను వివరణ అడగ్గా.. దుకాణం మహదేవప్ప పేరుపై ఉందని, నెలకు రూ.2 వేల బాడుగ, రూ.2 లక్షలు అడ్వాన్సు తీసుకుని పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ‘నిబంధనలు లేకుండానే పార్టీ కార్యాలయం ప్రారంభించాం. దుకాణాలు కట్టించాం. బాడుగలకు కూడా ఇచ్చాం. ఏమైనా రాసుకోండి’ అంటూ బరి తెగింపు ప్రదర్శించారు.
అనుమతులు ఇవ్వం
టీడీపీ కార్యాలయం ప్రారంభించినట్లు మా దృష్టికి రాలేదు. ఎండోమెంట్ దుకాణాల్లో ఏవైనా బాడుగకు ఇవ్వాలంటే కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. ఇష్టానుసారంగా ఇవ్వడం చట్టరీత్యా నేరం. ముఖ్యంగా పార్టీ కార్యాలయాలు, కార్యకలాపాలను ఆలయాలు, దుకాణాలు, సముదాయాల్లో నిర్వహించడానికి వీలు లేదు. నిబంధనల విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తీసుకుంటాం.
– దేములు, డిప్యూటీ కమిషనర్, దేవదాయ శాఖ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment