తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment