బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సాక్షాత్కరించిన శ్రీనివాసుడు
రేపు రాత్రి గరుడ వాహన సేవ
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవిలతో కలిసి ముత్యపు పందిరిలో భక్తులను సాక్షాత్కరించారు.
సాయంత్రం ఉత్సవరులకు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల వేయి నేతి దీపాల వెలుగులో సహస్రదీపాలంకార సేవలో ఊయలూగుతూ స్వామి దర్శనమిచ్చారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో రాత్రి 7–9 గంటల వరకు స్వామివారు వైభవంగా ఊరేగారు.
ఉత్సవ శోభల్లో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈ వాహన సేవలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి 6.30 నుంచి 12 గంటల వరకు గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమల ఘాట్‌రోడ్లలో నేటి ఉదయం నుంచి ద్విచక్రవాహనాలు అనుమతి రద్దు చేసింది.
పార్కింగ్ సరిపోయేలాగా వాహనాలను తిరుమలకు అనుమతించనుంది. తిరుమల వెళ్లే ప్రతి వాహనం కూడా ముందస్తు పాసును తీసుకొని వెళ్లాల్సి ఉంది. తర్వాత వచ్చే వాహనాలన్నీ తిరుపతిలోనే కట్టడి చేయనుంది. ఇందుకోసం అలిపిరి వద్ద పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment