ankurarpana
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు విష్వక్సేనుడు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న పెరుమాళ్ల తిరునాళ్లకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ప్రారంభమవుతాయి. సాయంత్రం పెద్దశేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇల వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల సప్తగిరులను టీటీడీ సుందరంగా ముస్తాబు చేసింది. విద్యుత్ దీపాలు అలంకరణతో కొండ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయ పరిసర పాంతాలు, ప్ర«ధాన మార్గాలను పలు రకాల పూల మొక్కలతో ప్రత్యేక అలంకరణ చేశారు. -
Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్) -
పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ
ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం. సోమవారం నుంచి పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల చరిత్ర తెలుసుకుందాం.. తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆలయ శాసనాలలో.. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ఏటా శ్రావణమాసం శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. శాస్త్రోక్తంగా అంకురార్పణ పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకీపై తిరువీధుల్లో విహరిస్తూ ఆలయ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ, మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. ఈమేరకు శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డెప్యూటీ ఈఓ రమేష్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగిస్తారు. మూడోరోజు – ముగింపు హోమాలు, అభిషేక పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగ మోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు. (చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు) మూడు రోజులు ఆర్జిత సేవల రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 8న సహస్ర దీపాలంకరణ సేవ, 9న అష్టదళ పాద పద్మారాధన సేవ, 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కల్యోణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. రెండో రోజు – సమర్పణ తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమ ర్పిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పరివార దేవతలకు పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
-
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రేపు ధ్వజారోహణం
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆటంకాలు లేకుండా జరగాలని సకల దేవతలను కోరుతూ అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. సర్వసేనాధిపతియైన విశ్వక్సేనుల వారి సమక్షంలో ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్ను ఆలయానికి తీసుకొచ్చి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నవపాలికలలో నింపి, అందులో నవదాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు 19వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.16 నుంచి 9.30 గంటల లోపు ధనుర్లగ్నంలో ధ్వజస్తంభంపై గజచిత్రపటాన్ని ఎగురవేయనున్నారు. రాత్రి చిన్న శేషవాహనంతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. లక్షకుంకుమార్చన అంకురార్పణ రోజు ఉదయం ఆలయంలో లక్షకుంకుమార్చన సేవ నిర్వహించడం 19ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండి, రైతులు, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, సకల జీవరాశులు సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారి అష్టోత్తర శత(108) నామావళిని వేదపండితులు లక్షసార్లు స్తుతిస్తూ ఈ సేవను లోకకల్యాణార్థం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు లక్షకుంకుమార్చన సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు రూ.1,116 చెల్లించి సేవా టికెట్ కొనుగోలు చేయాలి. ఒక టికెట్పై ఇద్దరిని అనుమతించనున్నారు. వీరికి వస్త్ర బహుమానం, అమ్మవారి ప్రసాదాలను అందజేయనున్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతో హాజరు కావాలని ఆలయ అధికారులు సూచించారు. రేపు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం నాలుగేళ్లుగా ఆనవాయితీ. ఈ ఏడాది కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే 19వ తేదీ మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నట్లు తెలిసింది. టీటీడీ ఉన్నతాధికారులు హైదరాబాదులో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఆహ్వానించారు. ఆయన హాజరు కాలేని పక్షంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రుల్లో ఒకరు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన మంత్రి పట్టువస్త్రాలు సమర్పించవచ్చని ఆలయ అధికారుల ద్వారా తెలిసింది.