garuda vahana seva
-
గరుడ వాహనంపై గోవిందుడు
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు గరుడునిపై మంగళవారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 6:30 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ లక్షలాది మంది భక్తుల సమక్షంలో అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనంపై దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని మలయప్ప అనుగ్రహించారు. ఈ సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్ పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను మలయప్పకు అలంకరించారు. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది.గరుడ వాహనం ముందు భక్త బృందాల భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు విశేషంగా అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ఉదయం మంగళవారం శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. తిరుమలలో బుధవారం శ్రీవారి స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగనున్నారు. కిక్కిరిసిన తిరుమలగిరులు గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ వాహన సేవలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడవాహన సేవ కోసం నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం 1 గంటకే నిండిపోయాయి. -
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
నేడు తిరుమలలో గరుడ వాహన సేవ
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశిష్టౖమైన గరుడ వాహన సేవ శుక్రవారం రాత్రి 7 గంటలకే ఆరంభమవనుంది. ఈ సేవకు 2.5 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయి. గరుడ సేవను అర్థరాత్రి తర్వాత 3 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడ సేవ కారణంగా శుక్రవారం నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని టీటీడీ తెలిపింది. కాగా, స్వామి ఊరేగే వాహనాలపై నాణేలు విసరవద్దని భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. భక్తులు విసిరే నాణేలు, మిరియాలు, ఉప్పు వంటి పదార్థాల వల్ల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం నాడు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలసి మలయప్ప పురవీధుల్లో వైభవంగా ఊరేగారు. సాయం సంధ్యావేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకార సేవ కోసం కొలువు మంటపంలో వేంచేపు చేశారు. వేయి నేతి దీపాల వె లుగులో ఉత్సవమూర్తులు ఊయలపై ఊ గుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంత రం బంగారు, వజ్రవైఢూర్య ఆభరణాలతో ఉత్సవరులకు విశేష అలంకరణ చేశారు. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారు వి హరించారు. ఈ వాహన సేవలో రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు, చెన్నయ్ గొడుగులు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి ధరించిన మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం శ్రీవారి వా హన సేవల్లో అలంకరిస్తారు. ద్వాపర యు గంలో గోదాదేవికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం మేరకు శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో వెలసిన గోదాదేవి ధరించిన మాలలు శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. శ్రీవిల్లి పు త్తూరు నుంచి తిరుమలకు వచ్చిన మా లలు, చిలుకలను శ్రీవారి ఆలయానికి అందజేశా రు. హిందూ ధర్మార్థ ట్రస్ట్ సమితి(చెన్నై) నిర్వాహకులు ఆర్ఆర్ గోపాల్జీ.. తిరుమలేశునికి 9 కొత్త గొడుగులను సమర్పించారు. -
అంగరంగ వైభవంగా గరుడోత్సవం
తిరుమల: విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్టు పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలు (గొడుగులు) అలంకరించారు. గరుత్మంతుడితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి తరించిన లక్షలాది మంది భక్తులు ఆనంద పరవశులయ్యారు. గోవిందా.. గోవిందా ... నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ నరసింహ కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. భక్తజన సంద్రంలో తిరుమలకొండ.. ఇక గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధంచేసిన గ్యాలరీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకే భక్తులు కిక్కిరిసి కనిపించారు. భక్తులు మాడ వీధుల్లోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేయడంతో గందరగోళానికి గురయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు కూడా నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు మరోవైపు.. క్యూ కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,382 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీలో రూ.2.85 కోట్లు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం విశేషం. మోహిని అవతారంలో గోవిందుడు మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. రాజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నడూలేని విధంగా ‘గరుడ’ దర్శనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున ఎన్నడూ లేని విధంగా భక్తులను వాహనం వద్దకు తీసుకొచ్చి గరుడ వాహన దర్శనం చేయించారు. ఆయా గేట్ల వద్దనున్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామివారి వాహన సేవకు అనుమతించారు. ప్రతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించారు. అదేవిధంగా గ్యాలరీల్లో రెండు లక్షల మంది, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. గరుడ వాహన సేవలో సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆయనను లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. అలాగే, ఉదయం జగన్మోహిని వాహనాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజ మోశారు. దీనికి ముందు తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి భగవత్ కుబా, కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుల చైర్మన్ సతీష్‌రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నేడు స్వర్ణరథం ఊరేగింపు తిరుమలలో ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) నిర్వహిస్తారు. సుమారు రూ.30 కోట్లతో తయారుచేసిన ఈ స్వర్ణరథాన్ని 2013 నుంచి ఉత్సవాల్లో ఊరేగిస్తున్నారు. సా.4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు. -
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : గరుడు వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
మోహినీ అవతారంలో జగన్మోహనుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న మలయప్ప స్వామిని, శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి విశేషమైన గరుడ వాహన సేవ కనులపండువగా జరిగింది. గరుడునిపై ఆశీనులై శ్రీమలయప్ప స్వామి భక్తకోటిని కటాక్షించారు. -
శ్రీవారి పున్నమి గరుడ వాహన సేవ
-
గరుడ వాహనా గోవిందా..
-
గరుడ వాహనా గోవిందా..
చిత్తూరు, తిరుమల: లక్షలాది మంది భక్తుల గోవిందనామస్మరణ నడుమ గోవిందుడు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రియ సేవకుడైన గరుడుడిని వాహనంగా చేసుకుని తిరువీధుల్లో ఊరేగారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు కిక్కిరిశాయి. తిరుమలలో ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి తోపులాటలూ లేకుండా వాహన సేవ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటలకే వాహనం ప్రారంభం.. భక్తులందరికీ దర్శనభాగ్యం వాహన సేవను నిర్ణీత సమయం రాత్రి 7 గంటలకే ప్రారంభించారు. వాహన మండపం నుంచి వెలుపలకు వచ్చిన వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ గ్యాలరీల్లో ఉండే భక్తులందరూ దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులు అధికంగా నిరీక్షించే ప్రాంతాల్లో హారతులతో కూడిన దర్శనం కల్పించారు. కూడళ్లలో ఎక్కువ సమయం వాహనాన్ని నిలిపి సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించడంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు సఫలీకృతులయ్యారు. వాహన సేవను చాలా నిదానంగా ముందుకు సాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాలరీలు, బారికేడ్ల నుంచి జనం స్వామిని దర్శించుకుని తన్మయత్వం పొందారు. రాత్రి 10 గంటల సమయంలో వాహనం వరాహస్వామి ఆలయం వద్దకు రాగానే వర్షం మొదలైంది. ఘటాటోపంతో వాహనాన్ని ఊరేగించారు. ఉదయం నుంచే గ్యాలరీల్లో నిరీక్షణ.. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ వాహన సేవను చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో నిండాయి. వాహనం ముగిసిన తర్వాత వారు అలాగే గ్యాలరీల్లో కూర్చున్నారు. కొత్తవారు ఉదయం 11 గంటల నుంచే రావడం మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంటకే గ్యాలరీలు నిండుగా కనిపిం చాయి. 4 గంటలకు గ్యాలరీలన్నీ నిండాయి. భక్తులకు ప్రయాణ కష్టాలు.. గరుడ వాహన సేవకు తరలివచ్చిన భక్తులకు ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడ్డారు. ఆర్టీసీ బస్సులు అధికంగా ఏర్పాటు చేసినా సరిపోలేదు. సీట్లకోసం భక్తులు అవస్థ పడాల్సి వచ్చింది. అందుకే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు టీటీడీ నిర్ణయించిన రూ.60 కాదని రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. ఘాట్ రోడ్డులో వేలాది వాహనాలు రావడంతో తిరుపతి తిరుమల మధ్య ప్రయాణకాలం అరగంట పెరిగింది. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో వాహనాల రద్దీ పెరగటంతో నామమాత్రంగా తనిఖీలు చేసి, కొండకు అనుమతించారు. -
తిరుమలకు భారీగా భక్తులు
తిరుమల: తిరుమలకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఆదివారం ఉదయం గరుడ వాహన సేవ సందర్భంగా శనివార సాయంత్రానికే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు మొత్తం 61,545 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు ఆలయాధికారులు తెలిపారు. భక్తులు 20 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటల సమయం, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతుందని తెలిపారు.