వేంకటేశ్వరుడికి విశేషాలంకరణతో వైభవంగా గరుడోత్సవం
నేడు శ్రీనివాసుడికి స్వర్ణ రథోత్సవం
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు గరుడునిపై మంగళవారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 6:30 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ లక్షలాది మంది భక్తుల సమక్షంలో అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనంపై దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని మలయప్ప అనుగ్రహించారు.
ఈ సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్ పురాతన బ్రాస్‌లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను మలయప్పకు అలంకరించారు. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది.
గరుడ వాహనం ముందు భక్త బృందాల భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు విశేషంగా అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ఉదయం మంగళవారం శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. తిరుమలలో బుధవారం శ్రీవారి స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగనున్నారు.
కిక్కిరిసిన తిరుమలగిరులు
గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ వాహన సేవలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడవాహన సేవ కోసం నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం 1 గంటకే నిండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment