సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు.
నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం
సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు.
సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ..
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
►నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
►మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభం.
►టీటీడీ ఉద్యోగులకు ఇంటిపట్టాల పంపిణీ.
►సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు.
►సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు.
►సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు.
►రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు.
►పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు.
రేపటి షెడ్యూల్ ఇదే..
►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
►ఉదయం 8.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఓర్వకల్ విమానాశ్రయానికి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment