మంత్రాలయం: భక్తకోటి కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వారం రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధనోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.
శ్రీరాఘవేంద్ర స్వామి ప్రశస్థి అవార్డులు అందుకోవడానికి ప్రముఖులు మంత్రాలయం రానున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్.. పూర్వారాధన వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఉత్సవాల నేపథ్యంలో వేదభూమి మంత్రాలయం విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతోంది.
పూర్తయిన ఏర్పాట్లు
ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శ్రీమఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి కోసం హెచ్‌ఆర్‌బీ, భూ, దుర్గారమణ, నరహరి, పద్మనాభ డార్మెటరీలు, పాత పరిమళ విద్యానికేతన్ పాఠశాలలను కేటాయించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు 50 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నదిలో నీటి కొరత దృష్టా పుణ్య స్నానాలకు వంద షవర్లు ఏర్పాటు చేశారు. మఠం సీఆర్‌ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. ఆరు లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. మహా రథోత్సవం సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవాన కురిపించనున్నారు.
అవార్డుల ప్రదానం
ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పూర్వారాధన రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రాలయం రానున్నట్లు సమాచారం. విద్వాన్ రామవిఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, ఎంఐటీ శాంతి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.విశ్వనాథ్‌కు రాయరు అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.
వేడుకల నిర్వహణ ఇలా..
● మంగళవారం రాయరు ఉత్సవాలు ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, రజిత మంటపోత్సవం, గో, గజ, తురగ పూజలు చేస్తారు.
● బుధవారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం ఉంటుంది.
● గురువారం పూర్వారాధన సందర్భంగా రజత సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు.
● శుక్రవారం మధ్యారాధన సందర్భంగా రాఘవేంద్రుల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు ఉంటాయి.
● శనివారం ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం, వసంతోత్సవం జరుపుతారు.
● ఆదివారం శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, అశ్వ వాహనోత్సవం ఉంటుంది.
● సోమవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment