
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు.
త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది.
కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం.
భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు.
భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment