ఇక వన్డే సమరం | Match Preview West Indies vs India, 1st ODI 2019 | Sakshi
Sakshi News home page

ఇక వన్డే సమరం

Published Thu, Aug 8 2019 4:44 AM | Last Updated on Thu, Aug 8 2019 5:00 AM

Match Preview West Indies vs India, 1st ODI 2019 - Sakshi

బలహీనమైనదే అయినా అనూహ్యంగా చెలరేగే వెస్టిండీస్‌తో టీమిండియాకు మరో సవాల్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ప్రావిడెన్స్‌ వేదికగా తొలి వన్డే. ఈ సిరీస్‌ నెగ్గి తమ దిగ్గజం క్రిస్‌ గేల్‌కు సగర్వంగా వీడ్కోలు పలకాలని కరీబియన్లు భావిస్తుండగా... లోపాలను సరిచేసుకుని పునర్‌ నిర్మాణ ప్రక్రియకు పునాదులు వేయాలని భావిస్తోంది భారత్‌. ఎవరి ప్రణాళికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.  

ప్రావిడెన్స్‌ (గయానా):  టి20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఊపులో... ప్రపంచ కప్‌ సెమీస్‌ నిష్క్రమణ గాయాన్ని మాపే ఆలోచనలో వెస్టిండీస్‌తో వన్డే సమరానికి సిద్ధమవుతోంది కోహ్లి సేన. పనిలో పనిగా వెటరన్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సమర్థంగా భర్తీ చేయాలని; బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నంబర్‌–4 స్థానానికి పరిష్కారం దొరకాలని ఆశిస్తోంది. కొంత క్లిష్టమే అయినా సత్తా మేరకు ఆడితే ఈ సిరీస్‌ సైతం మన సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. పరుగులు చేయడం అంత తేలికేం కాదని తెలుస్తోన్న ప్రావిడెన్స్‌ మైదానం పిచ్‌పై ఏ జట్టు నిలకడ చూపుతుందో వారికే విజయం దక్కనుంది.

అక్కడ అతడే!
వన్డే ప్రపంచ కప్‌ నుంచి గాయంతో వైదొలగిన ధావన్‌ తాజా టి20 సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు. తనకు మంచి రికార్డున్న వన్డేల్లో ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. అతడు ఫామ్‌ అందుకుని రోహిత్, కెప్టెన్‌ కోహ్లికి తోడైతే దిగులుండదు. అత్యంత చర్చనీయాంశమైన నంబర్‌–4 స్థానంలో కేఎల్‌ రాహుల్‌కే అవకాశం దక్కొచ్చు. ప్రపంచ కప్‌లో ప్రభావం చూపలేకున్నా కరీబియన్‌ పర్యటనకు తీసుకొచ్చారంటే కేదార్‌ జాదవ్‌పై టీం మేనేజ్‌మెంట్‌కు బాగా నమ్మకం ఉన్నట్లే. మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్పిన్‌ కూడా వేయగలడు కాబట్టి జాదవ్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. పరిస్ధితులను బట్టి పంత్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపొచ్చు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా ఖాయం.

మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌ సంగతేమిటన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది. ప్రపంచ కప్‌లో రాణించకపోవడంతో టి20 సిరీస్‌కు ఇద్దరినీ పక్కన పెట్టారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌ వీరికి సవాల్‌తో కూడుకున్నది. మెరుగైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నందున... ఈసారీ విఫలమైతే ‘కుల్చా’ ద్వయానికి దారులు మూసుకుపోయినట్లే. ప్రత్యర్థి స్పిన్‌ ఆడటంలో తడబడుతుంది కాబట్టి తొలి వన్డేలో ఇద్దరికీ చోటుండొచ్చు. మూడో పేసర్‌ అవసరం అనుకుంటే ఒకరిని పక్కనబెట్టే వీలుంది. కుడి ఎడమ సమీకరణాల ప్రకారం కుల్దీప్‌ను తప్పిస్తే ఖలీల్‌ అహ్మద్‌కు, చహల్‌ వద్దనుకుంటే నవదీప్‌ సైనీ బరిలో దిగుతారు. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ పరుగులు చేసి, మంచి లయలో ఉన్న భువనేశ్వర్, షమీలు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తే టీమిండియా గెలుపునకు బాటలు పడతాయి.

టి20ల్లో తుస్‌... వన్డేల్లో?
ప్రపంచ చాంపియనే అయినప్పటికీ టి20 సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో వెస్టిండీస్‌ పేలవ ప్రదర్శన కనబర్చింది. వన్డేలకు వచ్చేసరికి మార్పులతో జట్టు బలంగా ఉంది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సారథ్యం, గేల్‌ వంటి బ్యాట్స్‌మన్‌ అందుబాటులో ఉండటం, నిలకడగా ఆడే షై హోప్, రోస్టన్‌ చేజ్‌ చేరికే దీనికి కారణం. యువ హిట్టర్లు పూరన్, హెట్‌మైర్‌ ప్రమాదకారులు. పేసర్లు కాట్రెల్, ఒషాన్‌ థామస్‌ పటిష్టమైన టీమిండియా టాపార్డర్‌ను ఎంతమేరకు కట్టడి చేస్తారో చూడాలి.

తుదిజట్లు (అంచనా)
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, జాదవ్, పంత్, జడేజా, కుల్దీప్‌/ఖలీల్,           చహల్‌/సైనీ, భువనేశ్వర్, షమీ
వెస్టిండీస్‌: గేల్, లూయిస్‌/జాన్‌ క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్‌ (కెప్టెన్‌), కీమో పాల్, రోచ్‌/థామస్, కాట్రెల్, అలెన్‌


గేల్‌ ఎలా ఆడతాడో...
భారత్‌తో వన్డే సిరీస్‌ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌పై అందరి చూపు నిలిచింది. ప్రపంచ కప్‌లో అలరించలేకపోయిన గేల్‌... ఈ సిరీస్‌లో రాణించి కెరీర్‌కు ఘన వీడ్కోలు పలకాలని భావిస్తుండొచ్చు.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం టొరంటో వేదికగా భారత్‌పైనే అరంగేట్రం చేసిన గేల్‌... 298 వన్డేల్లో 10,393 పరుగులు చేశాడు. మరో 12 పరుగులు చేస్తే దిగ్గజ బ్రయాన్‌ లారా (10,405)ను అధిగమించి వెస్టిండీస్‌ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. 300 వన్డేలు ఆడిన క్రికెటర్‌గానూ రికార్డులకెక్కనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌పై అతడు 135, 50, 162, 77 పరుగులు చేశాడు. దీని ప్రకారం సొంతగడ్డపై అతడిని ఆపడం చాలా కష్టమని తెలిసిపోతుంది. మరి.. గేల్‌ ఏం చేస్తాడో?

భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇప్పటివరకు 127 వన్డేలు జరిగాయి. 60 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా... 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ను విజయం వరించింది. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

వెస్టిండీస్‌ గడ్డపై ఆ జట్టుతో భారత్‌ ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడింది. 14 మ్యాచ్‌ల్లో గెలిచి, 20  ఓడింది. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. 2017లో విండీస్‌లో పర్యటించిన భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో  గెల్చుకుంది. మరో మ్యాచ్‌ రద్దయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement