‘ఐ వాచ్’ | eye warn the cameras | Sakshi
Sakshi News home page

‘ఐ వాచ్’

Published Sat, Jun 11 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

‘ఐ వాచ్’

‘ఐ వాచ్’

దేశంలోనే తొలిసారి ‘ఐ వార్న్ కెమెరాలు’ వినియోగం

 

సిటీబ్యూరో: ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో పారదర్శకత కోసం సైబరాబాద్ కమిషనరేట్ మరో ముందడుగు వేసింది. గత రెండేళ్లుగా జంట కమిషనరేట్లలో ‘బాడీ వార్న్ కెమెరాలు’ వినియోగిస్తుండగా.. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అత్యాధునికమైన ‘ఐ వార్న్ కెమెరా’లు సమీకరించుకున్నారు. దేశంలో ఈ తరహా పరిజ్ఞానం వినియోగిస్తున్న పోలీసు వ్యవస్థగా సైబరాబాద్ రికార్డు కెక్కింది. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం సిబ్బందికి అందించారు. తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఏడు కెమెరాలు ఖరీదు చేశారు. ఆధునిక రంగుల కళ్లజోడుకు కుడి వైపున ఇమిడి ఉండే కెమెరా సాయంతో సిబ్బంది చూసిన ప్రతి ప్రాంతాన్నీ చిత్రీకరించే అవకాశం ఉంది. 32 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ఈ కెమెరాలు ఆడియో, వీడియోలను  నిర్విరామంగా 21 గంటల పాటు రికార్డు చేస్తాయి. కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగం వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 25 బాడీ వార్న్ కెమెరాలకు అదనంగా మరో 75 ఖరీదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వాహనచోదకులు, సామాన్య ప్రజలతో ఏ విధంగా సంభాషిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారనే అంశాలను బాడీ వార్న్, ఐ వార్న్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఈ పుటేజ్‌ను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోని కంప్యూటర్లలో భద్రపరుస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్/వీడియో కెమెరాలకు అదనంగా వీటిని వాడుతున్నట్లు ఆనంద్ తెలిపారు.


ఉల్లంఘనుల నుంచి జరిమానా డబ్బు నేరుగా వసూలు చేయకుండా.. క్యాష్ లెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాన్ని సైబరాబాద్ పోలీసులూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలాన్ పుస్తకాల స్థానంలో ట్యాబ్స్‌ను ఖరీదు చేశారు. వీటిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సిబ్బంది, అధికారులకు అందించారు.  క్షేత్రస్థాయిలో ఉండే సైబరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించడం కోసం కిట్‌బ్యాగ్స్ సైతం సమకూర్చుకున్నారు. బూట్లు, వాటర్ బాటిల్, సన్ గ్లాసెస్, నోస్ మాస్క్, రిఫ్లెక్టివ్ జాకెట్, రెయిన్ కోట్‌తో కూడిన ఈ కిట్లను ఆనంద్ వెయ్యి మంది సిబ్బందికి అందించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement