అధికారికంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ
దామోదర్ కోసం ‘ప్రత్యేక’ గాలింపు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్ల సొమ్మును పక్కదారి పట్టించిన వైనంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఘట్‌కేసర్‌ల్లోని బ్యాంకుల నుంచి దాదాపు రూ.30 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. స్వయంగా హైకోర్టు స్వాధీనంలోని డబ్బులను మాయం చేయడంపై న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. భారీ అవకతవకలకు పాల్పడిన ఈ కేసుల్ని ఛేదించాల్సిందిగా న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల తొలివారం నుంచి రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక పరిశీలన చేపట్టింది.
ఈ కేసులకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు సేకరించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు స్కామ్‌ను నిర్థారించారు. దీంతో శుక్రవారం దీనిపై అధికారికంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఖాయిలా పడిన పరిశ్రమల బకాయిల సెటిల్‌మెంట్ కోసం హైకోర్టు లిక్విడేటర్ ఆధీనంలోని సొమ్ము పక్కదారి పట్టడంలో బ్యాంకు అధికారుల పాత్రనూ సీబీఐ అనుమానిస్తోంది.
ఏడాది కాలం పాటు డిపాజిట్ చేసిన సొమ్మును కేవలం 15 రోజుల వ్యవధిలో తిరిగి ఇచ్చేయడం ఈ అనుమానాలకు బలాన్నిచ్చింది. ఆ నగదు ముంబై, గుజరాత్, రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లోని 13 ఖాతాల్లోకి బదిలీ చేయడంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న చెన్నైకు చెందిన దామోదర్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జరిగిన ఘట్‌కేసర్ బ్యాంక్ సహా ఇతర కేసుల్నీ సీబీఐ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
‘బ్యాంకుల కుంభకోణం’పై కేసు నమోదు
Published Sat, Dec 19 2015 12:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement