ఆరు శాఖల చట్టాల్లో మార్పులు చేర్పులు మాత్రమే
త్వరలో ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు ప్రత్యేక అధికారాలు
ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన కేబినెట్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు ప్రత్యేక చట్టానికి రూపు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జలవనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక చట్టం అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాలలోపు దానికి రూపం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ, మరింత బలోపేతం చేయడానికి ఆరు శాఖలకు చెందిన చట్టాలను సవరిస్తున్నారు. దీనికి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదముద్ర వేయడంతో త్వరలో ఆర్డినెన్స్ వెలువడనుంది.
ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార విభాగాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్‌ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్విసెస్ చట్టాల్లోని కీలకాంశాలను సవరించనున్నారు. వీటి కింద నోటీసులు జారీ సహా వివిధ అధికారాలను సైతం హైడ్రాకు అప్పగించనున్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం–1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించడం, అనధికార హోర్డింగ్స్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జరిమానాలు విధించడం తదితర అధికారాలు ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీకి మాత్రమే ఉన్నాయి.
కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటైన తర్వాత అమలులోకి వచ్చిన తెలంగాణ పురపాలక చట్టం–2021 ప్రకారం ఆయా పురపాలికలకూ ఇవి దఖలయ్యాయి. బీపాస్ చట్టం–2020 ప్రకారం జోనల్ కమిషనర్ల నేతృత్వంలోని జోనల్ టాస్‌్కఫోర్స్, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు ఇలాంటి అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలకు అధికారాలు వచ్చాయి. హెచ్‌ఎండీఏ చట్టం–2008లో 8, 23 ఏ సెక్షన్ల కింద ఆ విభాగం కమిషనర్‌కు కూడా విశేషాధికారాలు ఉన్నాయి.
తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317ఎఫ్ సెక్షన్ ప్రకారం అక్రమ కట్టడాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357ఎఫ్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్‌కు జలవనరులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. జీవోఎంఎస్ నం.67 ద్వారా 2002లో యూడీఏలతో పాటు ఎగ్జిక్యూటివ్ అధికారులకు, తెలంగాణ భూ ఆక్రమణల చట్టం–1905లోని 3, 6, 7, 7ఏ సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లకూ చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు.
ఈ యాక్ట్‌లతో పాటు వాల్టా చట్టం–2002, జీవోఎంఎస్–168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్–1999లకూ సవరణ చేసి హైడ్రాకు అవసరమైన అధికారాలు ఇస్తున్నారు. న్యాయ విభాగం సిఫార్సుల ప్రకారం హైడ్రా గవరి్నంగ్ బాడీలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్‌కు (సీసీఎల్‌ఏ) స్థానం కల్పించనున్నారు. ఈ మార్పుచేర్పులతో పాటు మరిన్ని కీలకాంశాలను హైడ్రా యాక్ట్‌లో పొందుపరచనున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment