విభజన ప్రక్రియ మొదలైంది: జైరాం రమేష్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ మొదలైంది అని కేంద్ర గ్రామీణ శాఖామంత్రి జై రాం రమేష్ అన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ మొదలైంది అని కేంద్ర గ్రామీణ శాఖామంత్రి జై రాం రమేష్ అన్నారు. విభజన ప్రక్రియ సజావుగా జరిగేందుకు రెండు కమిటీలు వేశామని: జైరాం రమేష్ తెలిపారు. ఆలిండియా సర్వీసు అధికారుల పంపిణీ కోసం ఒక కమిటీ, రాష్ట్ర స్థాయి అధికారుల కోసం మరో కమిటీ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
ఖమ్మంలోని 7 మండలాలు తిరిగి సీమాంధ్రలో కలుపుతామని.. అయితే బూర్గంపాడులోని ఆరు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయన్నారు. ఇందు కోసం త్వరలోనే కేంద్రం ఆర్డినెన్స్ తెస్తుందని జైరామ్ తెలిపారు. సీమాంధ్ర ఆర్థిక ప్రణాళిక అమలు కోసం ప్లానింగ్ కమిషన్‌లో ప్రత్యేక విభాగం వేశామన్నారు. వచ్చే వారం నుంచే అన్ని కమిటీలు, విభాగాలు పని చేయడం మొదలవుతుందన్నారు.
'4, 5 రోజుల్లో రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ విడుదలవుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీని అందులోనే ఉంచుతాం. 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాలి. తెలంగాణలో 10 ఏళ్లపాటు అడ్మిషన్ విధానం మారదు' అని జైరాం స్పష్టం చేశారు. కలహాలు, విభేదాలు మానుకుని రెండు ప్రాంతాలు నేతలు పరస్పరం సహకరించుకోవాలి జైరాం రమేష్ సూచించారు.