సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు ఇరు రాష్ట్రాల తరఫున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు ప్రాతినిధ్యం వహించే సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎంపిక కోసం 24న, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక కోసం 25న ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ విషయానికొస్తే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి పోస్టు కోసం నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అదే రోజున నామినేషన్లను పరిశీలించి, సాయంత్రం 4.15 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీ ఉదయం 11 గంటల్లోపు నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చు.
12 గంటలకు తుది జాబితా ప్రకటించి, 12.30కు ఎన్నిక నిర్వహించి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక ప్రక్రియ 23వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, ఎన్నిక, ఫలితాల వెల్లడి 25వ తేదీన ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
ఇప్పుడు వీరిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడిగా ఒక్కరి చొప్పున ఎన్నుకుంటారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికను గెజిట్ ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు గెజిట్ విడుదల కాలేదు. సాంకేతికంగా గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదు. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అన్న దానిపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బార్ కౌన్సిళ్ల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Published Wed, Nov 14 2018 2:53 AM | Last Updated on Wed, Nov 14 2018 2:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment