అధికార పార్టీ నేతల మెహర్బానీ చివరి ఆయకట్టు రైతులకు శాపంగా మారనుం. గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే కనిగిరి రిజర్వాయర్ నుంచి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నవంబరు రెండో తేదీ నుంచి విడుదల చేయాల్సిన నీటిని జిల్లా మంత్రి ఆదేశాలతో ముందుగా విడుదల చేయడంపై చివరి ఆయకట్టు రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది
బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో 4.98 లక్షల ఎకరాలను సాగునీరందించేలా శనివారం నెల్లూరు గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. నవంబరు రెండో తేదీన అధికారికంగా సోమశిల నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని తీర్మానం చేశారు. అయితే కనిగిరి రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఆదివారం ముందస్తుగానే నీటిని విడుదల చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైడేర్ ఎస్కేప్ చానల్‌కు 300 క్యూసెక్కులు, ఈస్ట్రన్ చానల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేశారు. వాస్తవానికి ఐఏబీలో జరిగిన తీర్మానం కాపీ ప్రభుత్వానికి అంది అక్కడి నుంచి నీటి విడుదలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాలి. అయితే మంత్రి మాటలతో ఇరిగేషన్ అధికారులు మాత్రం నీటిని ముందుగా విడుదల చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
ఆందోళనలో చివరి ఆయకట్టు రైతులు
కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల తెలుసుకున్న చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాదీ చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరందుతుందని సంబరపడ్డారు. అయితే ముందస్తుగా నీటి విడుదల చేయడంతో తమ పొలాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు మెహర్బానీ కోసం చివరి ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు.
చివరి ఆయకట్టుకు నీరందాలి
ఐఏబీ తీర్మానం జరగడమే ఆలస్యమైంది. చివరి ఆయకట్టు వరకు నీరందాలి. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదు. అయితే నారుమళ్లు వేసుకున్న రైతులకు మంచిదే. చివరి ఆయకట్టుకు నీరందేలా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై తగిన జాగ్రత్తలు పాటించి, రైతులకు నీరందేలా చూడాలి.
–జొన్నలగడ్డ వెంకమరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
మిగిలిన కాలువలకు ఎందుకు వదల్లేదు
డెల్టా ప్రాంతంలో అన్ని కాలు వలకు సాగునీరందాలి. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి కొన్ని కాలువలకు నీరు వదలడం సరికాదు. ఐఏబీ సమావేశంలో తీర్మానాలను గౌరవించాలి. రైతులందరినీ సమాన దృష్టితో చూడాలి.
–నెల్లూరు నిరంజన్‌రెడ్డి,
కోశాధికారి, జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య
కమిటీ చైర్మన్ల కోరిక మేరకు నీటి విడుదల
ఈస్ట్రన్ చానల్, పైడేరు కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల కోరిక మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేశాం. రైతులు ముందుగానే నారుమడులు పోసుకుంటారన్న చైర్మన్ల వాదతో నీటిన విడుదల చేశాం.
–షేక్ అహ్మద్‌బాషా, ఇరిగేషన్ ఏఈ, కొడవలూరు
Comments
Please login to add a commentAdd a comment