సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక(లోకల్) కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి శుభవార్త. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది.
ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్ 30న మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్ 1వ తేదీతో ముగిసింది.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు. కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్‌ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది.
విద్యా సంస్థలు,
ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి రాష్ట్రంలో స్థానిక హోదా పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి అనుమతి తీసుకుని లోకల్ స్టేటస్ పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని 1, 2 క్లాజ్‌లను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(నియంత్రణ, ప్రవేశాలు) సవరణ చట్టం–2019’ చేసింది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్థానికత హోదా కల్పనకు వర్తిస్తుంది.
అలాగే ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) అమెండ్‌మెంట్ ఆర్డర్–2019’ చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్‌కే షాహి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక హోదా సర్టిఫికెట్ పొందడమెలా?
తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్ స్టేటస్ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. 2021 జూన్ 1వ తేదీలోగా తహసీల్దార్ నుంచి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం–1) సమర్పించాలి.
గతంలో తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆధారాలుగా రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం లాంటివి జత చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఫలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫారం–2 సమర్పించాలి. మీ–సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment