గెజిట్ నోటిఫికేషన్లను కోర్టు ముందుంచండి
భూసేకరణ చట్టం సవరణలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర భూసేకరణ నిబంధనలను తీసుకొచ్చే ముందు గెజిట్‌లో ముసాయిదా నిబంధనలను ప్రచురించారో లేదో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ విషయంలో స్పష్టత కోసం గెజిట్ నోటిఫికేషన్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర భూసేకరణ చట్ట నిబంధనల తుది నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధా న కార్యదర్శి ఆర్.వెంకటరాములు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అభ్యంతరాలు స్వీకరించలేదు...
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ముందు ముసాయిదా నిబంధనలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వారి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతనే తుదిరూపు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... భూ సేకరణపై అభ్యంతరాలు పెం డింగ్‌లో ఉండగా జిల్లా కలెక్టర్ ఆయా భూముల యజమానులతో సేకరణ కు ఒప్పందం కుదుర్చుకోవచ్చా.. లేదా.. అన్న విషయంపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించతలపెట్టిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తాండా, మామిడ్యాల, భైలాంపూర్ గ్రామాల్లో రైతుల అభ్యంతరాలను పట్టించుకో కుండా భూసేకరణ చేయడంపై మామిడ్యాలకి చెందిన టి.శ్రీనివాస్ మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.