
సాక్షి, హైదరాబాద్: ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన నిర్మాణాల నుచేపట్టేటప్పుడు 2013 భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నుంచి ఆ నిర్మాణాలను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. సామాజిక ప్రభావ అంచనా వేయకుండానే ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ అన్నది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన నిర్మాణమని ధర్మాసనం తెలిపింది.
2013 భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ ఎం.విజయభాస్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10 కింద సామాజిక ప్రభావ అంచనా నుంచి తప్పించి కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టే నిర్మాణాలను ఈ చట్టం కింద మినహాయించవచ్చని నిబంధనలు చెబుతున్నాయని, ప్రభుత్వం ఇక్కడ అదే చేసిందని, అందులో తప్పులేదని స్పష్టం చేసింది. కలెక్టరేట్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన కార్యాలయమని, అందువల్ల మౌలిక సదుపాయాల కింద చేపట్టే నిర్మాణమే అవుతుందని తేల్చి చెప్పింది. కాబట్టి ఖమ్మం కలెక్టరేట్ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment