పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపండి
హైకోర్టులో పిటిషన్..
సాక్షి, హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టం కింద మొత్తం భూసేకరణ పూర్తయ్యే వరకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఎస్) కింద ఎలాంటి పనులను కొనసా గించకుండా మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఆ రెండు కంపెనీలను ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పీఆర్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ డివిజన్, కోడేరు మండల పరిధిలోని సర్వే నంబర్లు 93,94,95ల్లోని భూములను మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు ఆక్రమించు కున్నా యని, ఆ భూములను తక్షణమే ఖాళీ చేసి, వాటిని వాటి యజమానులకు అప్పగించేలా కూడా ఆ రెండు కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కె.కృష్ణారెడ్డి, కె.రామచంద్రారెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.