‘ఏకీకృతం’ అమలుకు ప్రత్యేక కమిటీ
ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే విధి విధానాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏకీకృత రూల్స్‌ను ఎలా అమలు చేయాలన్న విషయంలో ప్రత్యే కంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయా నికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేయగానే కమిటీని ఏర్పాటు చేసి అమలు విషయంలో విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శుక్రవారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీం దర్ తదితరులు కడియంను కలిశారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు గెజిట్ నోటిఫికేషన్ రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని, అమలు కు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావే శమై సలహాలు, సూచనలు తీసుకుంటామ న్నారు. టీచర్ల బదిలీలపై కూడా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
2013లోనే సెల్‌పై ఆంక్షలు
తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మాట్లాడవద్దని 2013లోనే సర్క్యులర్ వచ్చిం దని కడియం అన్నారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుని గదిలోగానీ, స్టాఫ్ రూమ్ లోగానీ, తరగతి బయటగానీ ఉపాధ్యా యులు సెల్ ఫోన్ మాట్లాడుకోవచ్చని, పాఠాలు చెప్పే తరగతి గదిలో మాత్రం ఫోన్ మాట్లాడవద్దని స్పష్టంచేశారు. ఏకీకృత నిబంధనలు గత 20 ఏళ్లుగా లేకపోవడం వల్ల విద్యావ్యవస్థలో పదోన్నతులు ఆగి, నిర్వహణ వ్యవస్థ కొంత ఇబ్బందిగా మారిందన్నారు. అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కడియం పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నిబంధనలకు ఆమోదం లభించడంతో పదోన్నతులు వస్తాయన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు అన్నీ కొలిక్కి వస్తున్నాయ న్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని నిర్ణయించామని, నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామని వివరించారు.
నమ్మకాన్ని పెంచుతున్నాం..
ప్రధానంగా మూడు కారణాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లిందని, ఆ నమ్మకాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని కడియం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం అందులో ప్రధానమైందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని, ప్రతి పాఠశాలలో ప్రైవేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించాలనే కోరికతో కూడా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 5,000 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టిందని, ఈ ఏడాది కూడా అవసరమైన మేరకు ఆ సంఖ్యను పెంచుతున్నామని కడియం వెల్లడించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తున్నామన్నారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంపై సమష్టిగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మరోవైపు దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ వెల్లడించింది.