* ఏపీ రాజధాని పరిధి 7,068 చ.కిలోమీటర్లు
* సీఆర్‌డీఏ చట్టం గెజిట్ నోటిఫికేషన్ జారీ
* సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను నోటిఫై చేసిన ప్రభుత్వం
* రాజధాని నగర ప్రాంత పరిధి 122 చదరపు కిలోమీటర్లుగా చట్టంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ చట్టం మంగళవారం (డిసెంబర్ 30వ తేదీ) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. చట్టంలో పేర్కొన్న అంశాలన్నిటిపై అధికారాలన్నీ సీఆర్‌డీఏకు దక్కుతాయి.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధి, ఆ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు తదితర వివరాలతో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు మొత్తం రాజధాని పరిధి 7,068 చదరపు కిలోమీటర్ల మేరకు ఉంటుందని, రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లలో ఉంటుందని వివరించారు. రాజధాని ప్రాంత ప్రజల సంక్షేమం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజా సంస్థలను, పట్టణాభివృద్ధి నిపుణులను సంప్రదించి రాజ ధాని ప్రాంతాన్ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రద్దయిన వీజీటీఎం ఉడా...
సీఆర్‌డీఏ చట్టంపై నోటిఫికేషన్ జారీతో ఆ చట్టం మంగళవారం అమలులోకి రావటంతో.. అదే రోజు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం ఉడా) రద్దయినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
సీఎం చైర్మన్‌గా సీఆర్‌డీఏ కమిటీ
ప్రభుత్వం సీఆర్‌డీఏకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్‌డీఏకు ఏపీ ముఖ్యమంత్రి చైర్మన్‌గానూ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గానూ ఉంటారు. ఆర్థికమంత్రి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఆర్‌డీఏ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు.
ముగ్గురు సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్‌గా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మెంబర్ కన్వీనర్‌గా సీఆర్‌డీఏ కమిషనర్ ఉంటారని పేర్కొన్నారు. కమిటీకి మరి కొంత మంది సభ్యు లు అవసరముందని భావిస్తే మరికొన్ని ప్రభు త్వ విభాగాల ఉన్నతాధికారులను నామినేట్ చేసుకోవచ్చని కూడా స్పష్టంచేశారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఇకపై రాజధాని ప్రాంతానికి భూమిని సమీకరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలుంటాయని జీఓలో పేర్కొన్నారు.
సీఆర్‌డీఏ కమిషనర్‌గా శ్రీకాంత్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ)కి కమిషనర్‌గా ఎన్.శ్రీకాంత్‌ను నియమిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవలే ఆయనను సీఆర్‌డీఏ ప్రత్యేక కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే సీఆర్‌డీఏ చట్టం-2014పై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అమల్లోకి సీఆర్‌డీఏ
Published Wed, Dec 31 2014 1:12 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement
Advertisement