సాక్షి, ఆదిలాబాద్ : కొత్త మద్యం పాలసీపై పలువురు ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కానందునా మార్పులేమైనా ఉంటాయా? అన్న మీమాంస వారిలో కనిపిస్తోంది. శనివారం కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే 9న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. శుక్రవారం ఎక్సైజ్ కమిషనర్‌తో డిప్యూటీ కమిషనర్లు, డీపీఈఓలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కాని నోటిఫికేషన్‌తోనే స్పష్టత రానుంది.
నిరుత్సాహం..
మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ.2లక్షల ఫీజు నిర్ధారించడంపై ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా పలువురు కొత్తవారు మద్యం వ్యాపారంలోకి రావాలని ఉత్సాహం చూపిస్తున్నా మొదటి మెట్టులోనే ఫీజు భారీగా ఉండడంతో వెనుకాముందు అవుతున్నారు. కొంతమంది యువకులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరి పేరిట దరఖాస్తు ఫీజు కట్టడం ద్వారా మద్యం టెండర్లలో పాల్గొనాలని ఉత్సాహం చూపుతున్నారు.
ఒకవేళ అదృష్టం కలిసొచ్చి లక్కీడ్రాలో షాపు దక్కితే ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు ఇచ్చే గుడ్‌విల్ పొంది వారికే షాపును నడుపుకునేందుకు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఇదివరకు లక్కీడ్రాలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. 2017–19 ఎక్సైజ్ పాలసీ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏడెనిమిది షాపులకు గాను 559 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రూ.లక్ష దరఖాస్తు ఫీజు ఉండగా, దీని ద్వారానే ప్రభుత్వానికి రూ.5.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు ఫీజు దశలోనే రెట్టింపు ఆదాయంపై దృష్టి సారించింది. దీంతో రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2లక్షలకు పెంచింది.
ఎక్సైజ్ ట్యాక్స్ భారం..
కొత్త ఎక్సైజ్ పాలసీలో స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.5లక్షలు ఏడాదికి నిర్ణయించడంపై వ్యాపారుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్నవారు తిరిగి షాపులు దక్కించుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఇటు ఏడాదికి చెల్లించే లైసెన్స్ ఫీజు పెరగడం, దీనికితోడు దరఖాస్తు ఫీజు పెంచడం, ఇవన్ని వారికి భారంగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉండగా, కొత్త పాలసీలో రూ.65 లక్షలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45లక్షలు ఉండగా, రూ.50లక్షలకు పెరిగింది. పెరిగిన లైసెన్స్ ఫీజులతో మద్యం వ్యాపారులు తర్జనభర్జన పడుతుండగా, మరోవైపు ఏడాదికి ఎక్సైజ్ పన్ను రూ.5లక్షలు కొత్తగా విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు కలిపి ఇది రూ.10 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.
పర్మిట్ రూమ్ ఉందా?.. లేదా?
వైన్‌షాపులకు పర్మిట్ రూమ్ విషయంలో కొత్తపాలసీలో ఎలాంటి అంశం పొందుపర్చకపోవడంతో ఈ విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. అధికారులు మాత్రం పాత పాలసీకి అనుగుణంగానే పర్మిట్ రూమ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే నోటిఫికేషన్‌లోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక కొత్త పాలసీలో బీరుపై కమిషన్ 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడంపై వ్యాపారస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. అసలే ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కమిషన్ తగ్గించడం ఏవిధంగా సబబన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమవుతోంది.
వైన్ దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పించాలని పొందుపర్చారు. ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైన్స్‌లన్నీ రోడ్ల సమీపంలో ఉన్నాయి. వాటికి పార్కింగ్ సౌకర్యం అసలే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న షాపులను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అంతా సీరియస్‌గా పరిగణించకపోతే ఆ స్థలాల్లోనే కొనసాగే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment