సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని జల వివాదాలపై కేంద్రం దృష్టి పెట్టింది. జల సమస్యలపై ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చక్కబెట్టడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడం, వాటి పరిష్కారాలు, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 11న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై గురువారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి, కావేరి నదులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమావేశం జరిగింది. గతేడాది ఫిబ్రవరి 20న జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగానే కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో గోదావరి నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరాన్ని తెలంగాణ నొక్కి చెప్పింది.గోదావరిలో నీరు ఎంత ఉందనే విషయంపై హైడ్రాలజీ సర్వే నిర్వహించాలని, తర్వాత మిగులు నీరు ఉంటేనే నదుల అనుసంధానంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment