
'తెలంగాణ ప్రభుత్వానిది మొండి వాదన'
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం మొండి వాదన చేస్తోందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నీటి పంపిణీపై బుధవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల భేటీ స్పష్టత లేకుండానే ముగిసింది. సమావేశం అనంతరం దేవినేని ఉమామహేశ్వర్‌రావు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును తాము కోరడంలేదని దేవినేని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు గెజిట్ చేసేంత వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వివాదాస్పదంగా మారాయని దేవినేని అన్నారు. తమ వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మొండి వాదనలు చేసినంత మాత్రాన చట్టాలు అనుకూలంగా మారవని తెలిపారు. చట్టాల్లో ఏముందో లాయర్లను అడిగి తెలుసుకోండంటూ సూచించారు.