
జల జగడాలకు జవాబేదీ?
* ఆరు నెలలైనా పరిష్కారాల వైపు పడని అడుగులు
* పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్రం నిర్లిప్తత
* బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నోటిఫై చేయలేదు
* ఇంకా ఏర్పాటు కాని పోలవరం ప్రాజెక్టు అథారిటీ
* ట్రిబ్యునల్ పరిధిని నిర్ణయించడంలోనూ జాప్యం
* నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ ఉన్నట్లా? లేనట్లా?
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజనకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి వివాదం చివరికి ఢిల్లీకి చేరటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణం. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయడానికే చట్టం వచ్చిన తర్వాత మూడు నెలలు పట్టింది.
విభజన తర్వాత 60 రోజుల్లోగా బోర్డులు ఏర్పాటు చేయాలని చట్టంలోని సెక్షన్ 85(1) స్పష్టంగా గడువు విధించినా.. కేంద్రం పట్టించుకోని విషయం విదితమే. ఆ బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లో రెండు బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను నోటిఫై చేయాలని చట్టంలో ఉంది. అయినా.. ఆరు నెలలు దాటినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులను నోటిఫై చేయకపోవడం వల్ల.. ఉమ్మడి ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ లేదు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున నవంబర్ 2 తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసినా.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అయినా బోర్డు మౌనసాక్షిగా మిగలడం మినహా.. ఏపీ ఫిర్యాదులపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. కేంద్రం బోర్డు పరిధిని నిర్ధారిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు అంటున్నారు.
ఏర్పాటు కాని పోలవరం అథారిటీ...
పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చునూ తిరిగి ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ పనులు వేగంగా జరగడంలో, పెండింగ్ అనుమతులు సంపాదించడంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అథారిటీ కీలక పాత్ర పోషించనుంది. కానీ చట్టం అమల్లోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఇంకా ఈ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తున్నారు.
బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధి ఏమిటి?
బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్-2)ను పొడిగిస్తున్నట్లు పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడం, ప్రాజెక్టు నిర్వహణ విధివిధానాల (ప్రొటోకాల్స్)ను రూపొందించడం.. పొడిగించిన ట్రిబ్యునల్‌కు అప్పగించిన బాధ్యతలు. పొడిగించిన ట్రిబ్యునల్ కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితమని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల వాదన తరహాలోనే కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకే పరిమితమని లేఖ రాసింది.
లేఖను అంగీకరించబోమని, అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రజేష్‌కుమార్ అడిగితే.. దాఖలు చేయడానికి మూడు నెలల సమయం కేంద్రానికి సరిపోలేదు. గురువారం జరిగిన భేటీలో.. మరో మూడు వారాల గడువు కావాలని కోరింది. కృష్ణా నది ఎగువ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి వాటాలు కేటాయించకుండా, ప్రొటోకాల్స్ లేకుండా.. దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులకే కేటాయింపులు ఎలా చేస్తారని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాల్సివస్తే.. ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. కానీ కేంద్రం ఎటూ తేల్చకుండా అస్పష్టతను కొనసాగిస్తోంది.
జలాలపై అపెక్స్ కౌన్సిల్ మాటేమిటి?
ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదాలు పరిష్కారం కాని పక్షంలో.. అపెక్స్ కౌన్సిల్ పరిష్కరిస్తుందని విభజన చట్టంలోని సెక్షన్ 84 చెప్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన ఉండే ఈ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. విభజన రోజునే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం ఇప్పటికీ ప్రకటించలేదు. మరి.. అపెక్స్ కౌన్సిల్ ఉన్నట్లా? లేనట్లా? అనే విషయంలో స్పష్టత లేదు.