విభజనతో జలయుద్ధాలు: సీఎం కిరణ్
రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ను కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువు అవతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతులతో సీఎం అన్నారు. కేంద్రం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని సీఎం కిరణ్ అంతకుముందు అన్నారు. రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు.