ఆ బీళ్లు దగాకు ఆనవాళ్లు!
ఆ బీళ్లు దగాకు ఆనవాళ్లు!
Published Fri, Oct 4 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టింది. అయినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యపై పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. రాష్ర్ట, మధ్య తరహా జలవనరుల మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచన మేరకు సాగు నిపుణులు సమావేశమై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డి సంక్లిష్టమైన నీటి సమస్య లోతు ల్లోకి వెళ్లి విశ్లేషించి, పరిష్కార మార్గాలపై మాట్లాడటానికి సాహసించలేక, తప్పుదోవ పట్టించే విధంగా సమస్యను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు. సాగునీటి రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు ‘సాక్షి’ దినపత్రికలో (అక్టోబర్ 3న) రాసిన వ్యాసంలో ‘దౌర్జన్యంగా ఇతర ప్రాంతాల నీటిని తరలించడం...’ అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా రాశారు. తద్వారా కరవు కాటకాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంత ప్రజలపై తీవ్రమైన నిందమోపి అవమానించారు.
గత జల సేతుబంధనం
రాష్ట్రంలో ఉన్న నలభై పైచిలుకు నదుల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పెద్దవి. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పెన్నా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారం గా 98 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఒకనాడు నీటి పారుదల రంగ నిపుణులు అంచనా వేశారు. కానీ నేడు అది ఒట్టిపోయి, నీటి లభ్యత గణనీయంగా పడిపోయిం ది. కృష్ణా, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అత్యంత కరవు పీడిత ప్రాంతాలున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2130 (2060+70 పున రుత్పత్తి జలాలు) శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నికర జలాలు లభిస్తాయని నిర్ధారించింది.
మన రాష్ట్రానికి 811 (800+11 పునరుత్పత్తి జలాలు) టీఎంసీ కేటాయిం చింది. అందులో 33 టీఎంసీలను జల విద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద చేర్చి, మిగిలిన 767 టీఎంసీలను 1960 సెప్టెంబర్ నాటికి సాగు నీటిని వినియోగించుకుంటున్న, నిర్మాణానికి అను మతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చింది. అలా వివిధ ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల పథకాలకు ట్రిబ్యునలే నిర్దిష్టమైన కేటాయింపులు చేసింది. నదీ పరీవాహక ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి కేటాయింపులు చేయలేదు. ఆ అంశాన్ని ఇప్పుడు వివాదాస్పదం చేసి ప్రయోజనం లేదు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31తో ముగియడంతో కృష్ణా నదీ జలాల పంపిణీపై పునఃసమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను నియమిం చింది. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా నిర్ధారించిన 2130 టీఎంసీల నికర జలాలను ముట్టుకోకుండా, మిగు లు జలాలను పంచాలన్న కర్ణాటక, మహారాష్టల్ర డిమాం డ్‌కు ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం లభించే సంవత్సరా లలో దిగువ రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టు కొని, మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కల్పించింది. అయి నా, తీర్పు అమలులో ఉన్న 1976 నుంచి 2000 సంవత్స రం వరకు అధికారాన్ని వెలగబెట్టిన ప్రభుత్వాల అలస త్వం, సాచివేత వైఖరి మూలంగా ఆ సదవకాశాన్ని చేజేతులా కోల్పోయాము.
కొత్త తీర్పు శరాఘాతమే
ఈ పూర్వరంగంలో మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ ముందు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలు బలంగా వాదించి, విజయం సాధించాయి. ట్రిబ్యునల్ ముసా యిదా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శరాఘాతంలా తగి లింది. ఇక రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటి? ప్రపంచంలో ఎక్కడా పరిగణనలోకి తీసుకోని 65 శాతం విశ్వసనీయతను బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రామాణికంగా తీసు కొని 2293 టీఎంసీలు లభిస్తాయని, అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2130 టీఎంసీల నికర జలాలను మినహాయించి, మిగిలిన 163 టీఎంసీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి 45 టీఎంసీల వాటా దక్కింది. ఆ నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, కనీస నదీ ప్రవాహం పద్దుకింద 6 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను నాగార్జునసాగర్ జలాశయంలో ‘కారీ ఓవర్’ పద్దు కింద కేటాయించిన 150 టీఎంసీలలో కలిపేయడం జరిగింది.
ఆల్మట్టి ఎత్తు పెంపు గొడ్డలిపెట్టు
ఆల్మట్టి జలాశయం ఎత్తును 519.6 మీటర్లకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిస్తే, బ్రిజేష్ ట్రిబ్యు నల్ 524.256 మీటర్లకు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసింది. పర్యవసానంగా సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో మనకు కేటాయించిన నికర జలాలైనా లభిస్తాయో, లేదో చెప్పలేని స్థితినెలకొన్నది. ఈ నేపథ్యం లోనే సుదర్శన్ రెడ్డి, విద్యాసాగర్‌రావు కొత్త వివాదానికి తెర లేపుతూ రాయలసీమకు నికరజలాలలో వాటా 144.7 టీఎంసీలేనని సెలవిచ్చారు.
జలవిద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టీఎంసీలను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టీఎంసీలను రాయల సీమ పద్దుకు జమ చేశారు. మరొకవైపున 19 టీఎంసీల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జలసంఘం ఆమో దంతో నిర్మిస్తున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్‌ఆర్ బీసీ)కు 11 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోవడానికి మాత్రమే వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికర జలాలను 122.70+11+ 11= 144.70 టీఎంసీలుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టీఎంసీల నీరెక్కడి నుంచి ఎస్‌ఆర్‌బీసీకి సరఫరా కావాలో వారు పేర్కొనలేదు.
ఇలాంటి వాదనతో గతంలో జరిగిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవ కాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవు తున్న అనం తపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి తుంగభద్ర జలా శయం నుంచి కేసీ కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటా యించిన 10 టీఎంసీల నికర జలాలను పెన్నా-అహో బిలం రిజర్వాయర్ (పీఏబీఆర్)కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశై లం జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పైనీటి సర్దుబాటు చేసింది. ఈ 10 టీఎంసీల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు సరఫరా కావాలి. దాన్ని అడ్డుకుంటే, తత్ఫలి తంగా తుంగభద్ర జలాశయం నుంచి పెన్నా-అహోబిలం రిజర్వాయర్‌కు చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది.
మొదటి నుంచీ మొండిచేయే
1937 నాటి ‘శ్రీభాగ్ ఒడంబడిక’ కాలగర్భంలో కలిసిపో యింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత పూర్వకం గా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేం ద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తా మని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు. తదనంతర కాలంలో ప్రజలు పోరాట ఫలితంగా దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయల సీమలో అంతర్భాగంగా ఉన్న బళ్లారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. ఈ చరిత్ర తెలియని అజ్ఞా నులూ ఉన్నారు. పైగా రాయలసీమ ప్రజలను నీటి దొం గలుగా చిత్రీకరించే ఉన్మాదం ప్రకోపించింది.
దాహార్తి తీరే మార్గం ఏది?
గోదావరి నదీజలాలపైనే తెలుగు ప్రజల భవిష్యత్తు ఆధా ర పడి ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల దప్పిక తీరి, అవి సమ గ్రాభివృద్ధి చెందాలన్నా గోదావరి నీటి తరలింపే శరణ్యం. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతోనే తెలుగు జాతి నీటి అవసరాలను తీర్చవచ్చు. ఆ నదుల అనుసంధానంతోనే మరు భూములను పంట పొలాలుగా మార్చడానికి మార్గం సుగమం అవుతుంది. తెలుగు జాతి ఐక్యంగా, శాంతియుతంగా సహజీవనం చేస్తూ, ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వంతో జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. నీటి కోసం యుద్ధాలు చేసుకునే దుస్థితిని ఇప్పు డు సృష్టిస్తే చరిత్ర క్షమించదు!
Advertisement
Advertisement