
ముంచిన పెద్దమనిషే.. మళ్లీ పంచుతారట !
* ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నీటి పంపిణీ బాధ్యత జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కే అప్పగింత
*ఆ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్టు ముసాయిదా బిల్లులో కేంద్రం వెల్లడి
*దిగువ రాష్ట్రాల హక్కులు పట్టని ట్రిబ్యునల్‌కే ఈ బాధ్యత ఇవ్వడంపై సీవూంధ్రలో భయాందోళన
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాలతో ఉన్న నీటి తగాదాల్లో మనల్ని నిండా ముంచేసిన పెద్ద మనిషి .. ఇప్పుడు అన్నదమ్ముల (ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల)కు నీటిని పంపిణీ చేయబోతున్నారు! నదీ పరీవాహకంలోని దిగువ రాష్ట్రాల సమస్యలు, హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా కృష్ణా జలాలపై తీర్పునిచ్చిన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013లో కేంద్రం పేర్కొంది. ఆయన ఎంపిక తెలంగాణకు దిగువ రాష్ట్రం కాబోయే సీవూంధ్రలో కొత్త ఆందోళనకు దారితీస్తోంది.
ఒకవైపు వున రాష్ట్రమే ఈ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో.. తిరిగి ఆయున ద్వారా తెలంగాణ- సీవూంధ్ర నీటి పంపిణీ చేయించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. గతంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేని పక్షంలో 1956 అంతర్‌రాష్ట్ర నదీ వివాదాల చట్టానికి లోబడి నీరు కేటాయించాలని, అలాగే కరువు పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిర్వహణా ప్రాధాన్యాలు (ఆపరేషనల్ ప్రొటోకాల్) స్పష్టంగా పేర్కొనాలని బ్రిజేశ్ కుమార్‌ను కోరనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది.
బోర్డులతో గందరగోళం
తుంగభద్ర బోర్డు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పరిమాణాన్ని ఏనాడూ కర్ణాటక విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి జలచౌర్యం జరుగుతున్నా బోర్డు తీసుకున్న చర్యలేవీ లేవు. ఇప్పుడు కృష్ణా, గోదావరి నదుల్లోని నీటి పంపకాలు పక్కాగా అమలు చేయడానికి రెండు దశల వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో బోర్డులు తీసుకునే నిర్ణయాలు ఇరు రాష్ట్రాలు అమలు చేయడానికి అంగీకరించని పరిస్థితుల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మాత్రం కేంద్రం ఎలాంటి సమాధానాన్ని వివరించలేదు.
కరువు పరిస్థితుల్లో దిగువ రాష్ట్రానికి నీరు అందకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఈ రెండు దశల వ్యవస్థ కూడా గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కృష్ణా-గోదావరి ఉన్నతమండలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. సాంకేతిక అంశాలను పరిశీలించే మండళ్లపై పర్యవేక్షణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్రతిపాదనలకు ఇది ఆమోదం తెలుపుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే.. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.
భవిష్యత్తులో తలెత్తే అంశాలను ప్రస్తుత కృష్ణా నదీ వివాదాల ట్రిబ్యునల్ పరిష్కారం చూపని పక్షంలో కొత్త ట్రిబ్యునల్‌కు నివేదించాలి. కృష్ణా, గోదావరిల రోజువారీ వ్యవహారాల కోసం ఉన్నతాధికారుల నేతృత్వంలో యాజమాన్య మండళ్లను ఏర్పాటు చేస్తారు. కేంద్రంలో కార్యద ర్శి/అదనపు కార్యదర్శి స్థాయిలోని అధికారి ఈ బోర్డులకు అధ్యక్షత వహిస్తారు. విభజన పూర్తై 60 రోజుల్లోగా ఇవి ఏర్పాటవుతాయి. కృష్ణా యాజమాన్య మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గోదావరి యాజమాన్య మండలి తెలంగాణ రాష్ట్రం నుంచి పనిచేస్తాయి. ఈ బోర్డుల్లోకి ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ నిపుణులను డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటారు. తర్వాత వారిని బోర్డు శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఒక్కో బోర్డుకు చీఫ్ ఇంజనీర్(సీడబ్ల్యుసీ) స్థాయిలో కార్యదర్శి ఉంటారు. బోర్డులు పనిచేయడానికి అదనపు సిబ్బందిని కేంద్రం మంజూరు చేస్తుంది. డ్యామ్‌లు, హెడ్‌వర్క్స్, రిజర్వాయర్ల భద్రత కోసం సీఐఎస్‌ఎఫ్ బలగాలను నియమిస్తారు. ఈ బోర్డు ఖర్చులను ఇరు రాష్ట్రాలు భరించాలి. యాజమాన్య మండళ్లు డ్యామ్‌లు, హెడ్‌వర్క్స్, కాలువలు, జల విద్యుత్కేంద్రాలు పరిపాలన, నియంత్రణ, అమలు, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టులు కూడా కొత్త బోర్డుల పరిధిలోకే వస్తాయి.
తాగు, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత..
నీటి వివాదం తలెత్తితే ముందుగా తాగునీరు, తర్వాత పారిశుధ్య అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్‌కా.. సాగుకా? దేనికి నీటిని కేటాయించాలనే వివాదం వస్తే ముందు సాగుకు నీరివ్వాలని ముసాయిదా బిల్లు స్పష్టం పేర్కొంది. సమైక్య రాష్ట్రంలో ఈ రెండు నదుల నీటి పంపకాలు.. ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు ప్రకారమే అమల్లో ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించే పక్షంలో ఇరు రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి. ఈ యాజమాన్య మండళ్లు ఇరు రాష్ట్రాలకు ప్రకృతి విపత్తు/కరువు/వరదలపై సలహాలు ఇవ్వాలి. బోర్డు నిర్ణయాలు అమలు చేసే విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి. యాజమాన్య మండలి నిర్ణయాన్ని అమలు చేయకుంటే కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆంక్షలు విధిస్తుంది.
ట్రిబ్యునల్ కొనసాగింపు ఎలా..?
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తామని కేంద్రం ముసాయిదా బిల్లులో పేర్కొంది. అయితే అదెలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి దీనిని నియమించారు. అందుకు ఇచ్చిన నియమ నిబంధనలు వేరని, ఇక్కడ కొత్త రాష్ట్రాల నీటి పంపిణీకి ఆ నిబంధనలకు సంబంధం లేదని, అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్ ఎలా కొనసాగుతుందని జల వనరుల నిపుణుడు ఒకరు ప్రశ్నించారు.
ఆ ఆరు ప్రాజెక్టులకు నీళ్లెలా ఇస్తారో?
బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ ఆరు ప్రాజెక్టులకు చుక్కనీటి కేటారుుంపుల్లేవు... వురిప్పుడు ఆయనే ఓ కొత్త పాత్ర పోషిస్తూ అవే ప్రాజెక్టులకు నీళ్లెలా పంచుతారు? గతంలో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే బాధ్యతను కేంద్రం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు అప్పగించనున్న నేపథ్యంలో తలెత్తుతున్న సందేహమిది. ఈ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను నికర జలాలుగా మార్చి కేటాయించిన నీటిని నాగార్జునసాగర్, జూరాల, తెలుగుగంగకు క్యారీ ఓవర్ నీటిగా తీర్పునిచ్చిన నేపథ్యంలో నెట్టెంపాడు(21.4 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఎఎంఆర్‌పీ(30 టీఎంసీలు), వెలిగొండ(43.5 టీఎంసీలు), హంద్రీనీవా సుజల స్రవంతి(40 టీఎంసీలు), గాలేరు నగరి సుజల స్రవంతి(38 టీఎంసీలు) ప్రాజెక్టులకు కావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీటిని ఎక్కడ నుంచి ఇస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు మాత్రం క్యారీఓవర్‌గా 145 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు, జూరాల 9 టీఎంసీలు కేటాయించారని నిపుణులు చెబుతున్నారు. కానీ పైన పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు నీరు కేటాయించకపోవడం వల్ల అవి ప్రశ్నార్థకంగా మారతాయని హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ ఎత్తిపోతల ద్వారా వీటికి నీరు మళ్లించాలని చూసినా, కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న కృష్ణా యాజమాన్య మండలి(మేనేజ్‌మెంట్ బోర్డు) అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులకు నీటి లభ్యత అనుమానాస్పదమే. అదీకాక కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండితే తప్ప.. తెలంగాణకు అటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీరు వచ్చే అవకాశమే లేదు. ఈ ఆరు ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలంటే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును మార్చాల్సిందేనని నిపుణులు వాదిస్తున్నారు. మరి అది సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.