అన్యాయాన్ని ఎలుగెత్తుదాం | cm kcr and harish rao discuss on water problem | Sakshi
Sakshi News home page

అన్యాయాన్ని ఎలుగెత్తుదాం

Published Sun, Sep 18 2016 2:39 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

అన్యాయాన్ని ఎలుగెత్తుదాం - Sakshi

అన్యాయాన్ని ఎలుగెత్తుదాం

అపెక్స్ కౌన్సిల్‌లో మన వాణిని గట్టిగా వినిపిద్దాం: సీఎం కేసీఆర్
కృష్ణా, గోదావరిలో 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం
⇒  పాలమూరు, డిండి ముమ్మాటికీ పాతవే
⇒  కల్వకుర్తికి నీటి వాటా పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం
⇒  ఏపీ ఉల్లంఘనలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి
⇒  అన్ని వివరాలతో సిద్ధంకండి
⇒  మంత్రి హరీశ్, అధికారులతో సీఎం సమీక్ష

 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాల్లో తెలంగాణకు 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని, జలాల్లో రాష్ట్ర వాటాలను మరింత పెంచాలన్న వాదనలు బలంగా వినిపించేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావాల్సిన 90 టీఎంసీల వాటాను గట్టిగా డిమాండ్ చేయాలని, బేసిన్ పరిధిలో వాడే ప్రతి నీటి చుక్కకు లెక్క ఉండేలా టెలీమెట్రీ విధానం అమలు చేయాలని కోరనుంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని,  ఉమ్మడి ఏపీలోనే వాటిని చేపట్టిన అంశాన్ని స్పష్టంచేయనుంది.

ఈ నెల 21 కేంద్ర మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తన అధికార నివాసంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ విజయ్ ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. జలాల విషయంలో ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయమే ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, వీటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేలా కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చకు వచ్చే ప్రతీ అంశంపై ఆధారాలు, నివేదికలతో సహా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ ఎజెండా రాష్ట్రానికి అందిన తర్వాత మరోమారు సమావేశమై చర్చించనున్నారు.
 
 మన వాటా కోసం పట్టుపడదాం
 కృష్ణా జలాల్లో తెలంగాణకు పెంచాల్సిన వాటాపై ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నదిపై ఏదైనా ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు నీటిని తరలిస్తే.. అంతే వాటా ఎగువ రాష్ట్రాలకు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో.. తెలంగాణకు 90 టీఎంసీల వాటా దక్కుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నట్లు తెలిసింది. ఈ 90 టీఎంసీల వాటాను రాష్ట్రానికి ఇవ్వాలని.. ఈ లెక్కన రాష్ట్రానికికి 389 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించారు.
 
 ఆ ప్రాజెక్టులు పాతవే..
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, వీటికి ఉమ్మడి ఏపీలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2008 నుంచి డిండి, 2013లో పాలమూరు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కల్వకుర్తి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచే నిర్ణయం కూడా ఉమ్మడి ఏపీలోనే జరిగిందన్నారు. గోదావరి పరిధిలో చేపట్టిన కంతనపల్లి, కాళేశ్వరం, చనాకా కొరాటా, సీతారామ ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, వాటన్నింటికి గతంలో నీటి కేటాయింపులు జరిపిన విషయాన్ని అపెక్స్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
 
 ఏపీ ఉల్లంఘనలను వివరిద్దాం..
 కృష్ణా జలాల్లో ఏపీ రెండున్నరేళ్లుగా పాల్పడుతున్న ఉల్లంఘనల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 2014-15 నుంచి కృష్ణా జలాల్లో తనకున్న వాటాకు మించి.. ఏపీ అధికంగా నీటిని తరలిస్తున్న అంశంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 90 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించినా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించిన లెక్కల్లో చూపలేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 4,300 క్యూసెక్కులు తోడుతున్నామని ఏపీ చెబుతున్నా.. 12 వేల క్యూసెక్కులకు పైగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనలను కేంద్రం ముందు పెట్టి టెలీమెట్రీ విధానం తక్షణం అమల్లోకి వచ్చేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.
 
 ఆ లెక్కలన్నీ తీయండి
 సీఎం కేసీఆర్‌తో సమావేశానికి ముందు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘంగా చర్చించారు. అపెక్స్ భేటీలో ఏపీ ప్రస్తావనకు తెచ్చే అంశాలకు ఎలా జవాబు ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేశారు. పోతిరెడ్డిపాడు కింద 2014-15లో 33 టీఎంసీలు, 2015-16లో 13 టీఎంసీలు, 2016-17లో 33 టీఎంసీల మేరకు ఏపీ అధికంగా వాడుకుందని, ఆ లెక్కలన్నీ తీయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement