- నీళ్ల పంచాయితీపై రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ
- ఇరు రాష్ట్రాలకు నోటీస్ ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ
- నేడు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్
- మొత్తం ఐదు అంశాలతో ఎజెండా ఖరారు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల వనరుల శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశానికి సంబంధించి సోమవారం కేంద్ర జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు నోటీసులు పంపింది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారమే ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల బృందం వెళ్లనుంది. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఎజెండాలో చేర్చిన అంశాలపై రాష్ర్టం కసరత్తు ముగించింది. తీర్పులు, జీవోలు, ఒప్పం దాలు, నివేదికల కాపీల్ని సిద్ధం చేసింది. ఎజెండాలో చేర్చని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)ను ఆరో అంశంగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా తెలిసింది.
ఇదీ ఎజెండా..: అపెక్స్ కౌన్సిల్ ఎజెం డాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్‌లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శక ంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్‌లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు.
పూర్తయిన కసరత్తు..
అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చినవాటితోపాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు తేవాలని నిర్ణయించిన అంశాలపై తెలంగాణ కసరత్తు పూర్తి చేసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, కల్వకుర్తి వాటాల పెంపునకు సంబంధించి ఉమ్మడి ఏపీలో చేసిన ప్రతిపాదనలు, నీటి వాటాల్లో గత రెండున్నరేళ్లుగా ఏపీ చేసిన ఉల్లంఘనలు, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల్లో ఏపీ సహాయ నిరాకరణకు సంబంధించి అన్ని ఆధారాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం సిద్ధం చేశారు. సీఎం సూచనల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం సాయంత్రం వరకు కసరత్తు కొనసాగించారు. దీనిపై బుధవారం ఉదయం సీఎం, మంత్రి హరీశ్‌రావులు మరోమారు చర్చించే అవ కాశం ఉంది. సాయంత్రం సీఎం, మంత్రి, అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీకి రె‘ఢీ’!
Published Tue, Sep 20 2016 2:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement