ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
⇒ హస్తినకు చేరిన నీళ్ల పంచాయితీ
⇒ పాల్గొననున్న తెలంగాణ, ఏపీ సీఎంలు, మంత్రులు, అధికారులు
⇒ అధికారులతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ సమీక్ష
⇒ పాలమూరు, డిండిలపై పాత జీవోలు సహా పలు నివేదికలతో రెడీ
⇒ పట్టిసీమ, పోలవరం కింద వాటాపై నిలదీయాలని నిర్ణయం
⇒ ఆర్డీఎస్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు సంసిద్ధం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ మధ్య రెండున్నరే ళ్లుగా నలుగుతున్న వివాదం హస్తిన చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శ ర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్‌లు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్‌లో సమావేశం జరగనుంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి.
మన వాదనలు గట్టిగా వినిపిద్దాం..
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు, డిండి, టెలీమెట్రీ విధానం, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ, పోలవరం కింది వాటాలు, నీటి పంపిణీ-నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన తర్వాత.. ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై తెలంగాణ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అన్ని అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో మార్పుచేర్పులపై కీలక సూచనలు చేశారు. ఏపీ లేవనెత్తే ప్రతీ అంశాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా రాష్ట్ర వాదనలు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు.
కీలకంగా ఆర్డీఎస్..
ఎజెండాలో లేని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ నిర్ణయించింది. నిజానికి ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీని కింద 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా 20 వేలకు మించి అందడం లేదు. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండియాయి. దీంతో ఆనకట్ట పొడవు పెంచేందుకు నిర్ణయించి, పనులు చేపట్టగా ఏపీ పదేపదే అడ్డుకుంటోంది. దీనిపై చర్చలకు ఆహ్వానించినా.. ఏపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనికి తోడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ అంశాలను అపెక్స్ కమిటీ ముందుంచాలని సీఎం నిర్ణయించారు.