ఉమాభారతి (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు
బాగా తడిసిపోయి వచ్చారు కౌన్సిల్ మీటింగ్‌కి కేసీఆర్‌గారు, చంద్రబాబుగారు! బయటికి చూశాను. సన్నటి జల్లు. కేసీఆర్ వణుకుతున్నారు. అసలే బక్కపలుచని మనిషి. ఏసీ ఆఫ్ చేయించాను. చంద్రబాబు చొక్కా పిండుకుంటున్నారు. ఆయన చొక్కా ఆయనే పిండుకోవాలి కాబట్టి నా సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ చేసే సహాయం కూడా ఏమీ లేకుండా పోయింది. తల తుడుచుకోడానికి రెండు పొడి టవల్స్ తెప్పించాను.
‘‘ఇంత వర్షం ఎప్పుడు పడింది సంజీవ్?’’ అని అడిగాను. ‘‘మేడమ్... అది ఢిల్లీ వర్షం కాదు. ఢిల్లీ బయటి వర్షం. ఒకటి ఆంధ్రా వర్షం. ఒకటి తెలంగాణ వర్షం. ఫ్లయిట్ ఎక్కేముందే ఇద్దరు సీఎంలూ తడిసినట్లున్నారు’’ అన్నాడు సంజీవ్ నా చెవిలో మెల్లిగా. కేసీఆర్‌గారు టవల్ అందుకుని శుభ్రంగా తల తుడుచుకున్నారు. తుడుచుకున్నాక, ప్యాంట్ జేబులోంచి దువ్వెన తీసి చక్కగా తల దువ్వుకున్నారు. షర్ట్ కాలర్ సరి చేసుకున్నారు. కొద్దిగా వాటర్ తాగి, బాటిల్‌ని టేబుల్ మీద పెట్టారు. అది తనతో పాటు తెచ్చుకున్న బాటిల్. కేంద్ర జల వనరుల శాఖ తెప్పించిన బాటిల్ కాదు. పద్ధతైన మనిషిలా ఉన్నారు కేసీఆర్!
చంద్రబాబుగారింకా తల తుడుచుకోలేదు. ఆయన తల మీద నుంచి చుక్కలు చుక్కలుగా నీళ్లు కారుతున్నాయి. ‘‘చంద్రబాబుగారూ.. తల తుడుచుకోండి’’ అన్నాను. ‘‘నేను తుడుచుకునిపోయే రకం కాదు, తేల్చుకునిపోయే రకం’’ అన్నారు చంద్రబాబు! ఆయన మూడ్ బాగున్నట్టు లేదు. ‘‘మంచినీళ్లు తాగుతారా?’’ అన్నాను వాటర్ బాటిల్‌ని చంద్రబాబు చేతికి అందిస్తూ. ‘‘వద్దు’’అన్నారు. ‘‘నాకు మీ బాటిల్ అక్కర్లేదు’’ అన్నారు. ‘‘కేసీఆర్‌లా మీ బాటిల్ మీరే తెచ్చుకున్నారా?’’ అన్నాను నవ్వుతూ. చంద్రబాబు నవ్వలేదు. ‘‘కేసీఆర్ బాటిల్ తెచ్చుకోవడం ఏమిటి?! కేసీఆర్ నీళ్లు తాగుతున్న బాటిల్ నాదే. నాది నాకు ఇప్పించేస్తే నేను వెళ్లిపోతాను’’అన్నారు!
కేసీఆర్ వైపు చూశాను. కేసీఆర్ నావైపు చూడలేదు. అసలు ఎవరి వైపూ చూడలేదు. ‘‘బాటిలు చంద్రబాబుది కాదు, బాటిల్‌లోని వాటరూ చంద్రబాబుది కాదు’’ అంటూ బాటిలెత్తి చంద్రబాబు కళ్ల ముందే ఇంకో గుక్క గొంతులో పోసుకున్నారు కేసీఆర్! ‘‘విభజన ముందు వరకే ఇది మా ఇద్దరి బాటిల్. విభజన తర్వాత ఇది నా ఒక్కడి బాటిల్’’ అన్నారు మరో గుక్క ఒంపుకుంటూ.
బాటిల్ చేతికి వచ్చే వరకు పచ్చిగంగ ముట్టనని లేచి వెళ్లిపోయారు చంద్రబాబు. వరుణుడొచ్చి ఎన్ని టీఎంసీలు కుమ్మరించినా చేతిలోని బాటిల్‌ని మాత్రం వదిలిపెట్టేదిలేదని పైకి లేచారు కేసీఆర్. కేసీఆర్ కేసీఆర్‌లా లేరు, చంద్రబాబు చంద్రబాబులా లేరు. కృష్ణా, గోదావరి నదుల్లా ఉన్నారు. ఈ నదులను అనుసంధానం చెయ్యడం సాధ్యమేనా?!