
నీటి సమస్యలను పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన
సాక్షి, హైదరాబాద్: రైతాంగం కోసం రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న నీటి సమస్యలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కలసి పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. మంచి వాతావరణం కల్పించాలని.. రైతులకు మంచి చేయాలని కోరారు. భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం జరిగిన ‘సృజనాత్మక వరి రైతుల సమావేశం’లో కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 30 మంది రైతులు కనుగొన్న పద్ధతులను ఆవిష్కరించారు. అనంతరం వారిని సత్కరించారు. తెలంగాణ, ఏపీల్లో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు.
కొత్త పద్ధతులతో వందల కొద్దీ వంగడాలను తయారుచేస్తున్నప్పటికీ ఖర్చు పెరుగుతుందే కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి గిట్టుబాటు ధర రూ. 1,200 మాత్రమే ఉందనీ... అందుకయ్యే ఖర్చు మాత్రం రూ. 1,500 వరకు అవుతోందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్‌రావు మా ట్లాడుతూ సోనామసూరి, బాస్మతి వరిలో హైబ్రీడ్ తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఐఐఆర్‌ఆర్ డెరైక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రైతులు సబ్సిడీల కోసం ఆలోచించడం లేదని.. మంచి విత్తనం, కల్తీలేని ఎరువులు కావాలని కోరుకుంటున్నారన్నారు.