సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ ప్రకటించారు. నదీ జలాల వివాదాలన్నింటినీ ఇదే ట్రిబ్యునల్ పరిధిలోకి తెస్తామన్నారు. మార్చి–ఏప్రిల్‌లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదిస్తామని వెల్లడించారు. ‘‘ఒక్కో నది పరిధిలో ఒక్కో ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ తీర్పులు వెలువరించాక సైతం కొన్ని రాష్ట్రాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. నదుల వారీగా ట్రిబ్యునల్స్ ఉండడం వల్ల డబ్బు, కాలం వృథా అవుతోంది. దీనికి విరుగుడుగా ఒకే ట్రిబ్యునల్ అవసరం.
అన్ని నదీ వివాదాలను దీని పరిధిలోకి తెస్తాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు. ఇప్పటికే ఆయా ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న కేసులన్నింటినీ ఒకే ట్రిబ్యునల్ కిందకు తెచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం’’అని మేఘవాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ వివాంటా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ నుంచి మంత్రి హరీశ్‌రావు, సీఎస్ ఎస్‌కే జోషి, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూలు హాజరు కాగా ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు గైర్హాజరయ్యారు.
ఏపీ తరఫున అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సలహాదారు రామకృష్ణ, కర్ణాటక, తమిళనాడు తరఫున జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూ, కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ, సీడబ్ల్యూసీ చైర్మన్ మాజిద్ హుస్సేన్‌తో కలసి మేఘవాల్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందన్నారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమా వేశం హైదరాబాద్ డిక్లరేషన్‌గా పిలవవచ్చన్నారు.
తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావేరి మేనేజ్‌మెంటు బోర్డు, కావేరి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతామని, నా బార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణలో మిషన్ కాకతీ య మాదిరే తమ రాష్ట్రంలోని 1,200 చిన్న, 80 పెద్ద చెరువుల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలని కోరినట్లు పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment