'తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లే'
చిత్తూరు : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆయన బుధవారం చిత్తూరు జిల్లా సోమల బహిరంగ సభలో మాట్లాడుతూ విజభన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరే గతన్నారు. మన నీటి కోసం మనమే తన్నుకోవాలా?, విభజన జరిగితే సాగుకు నీళ్లుండవని అన్నారు.
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రిని చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. తెలుగు రాని సోనియాగాంధీ, తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు.