samaikya sankaravam yatra
-
ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చావ్ !: వైఎస్ జగన్
* సమైక్య శంఖారావంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు * ప్రతిపక్ష నాయకుడిగా ఉండి విభజనకు సహకరిస్తావు * ఒక ప్రాంతం వారితో తెలంగాణ అనిపించావు.. * మరోప్రాంతం వారితో సమైక్యాంధ్ర అనిపించావు * 44 రోజులపాటు సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అనడానికి నోరు రాలేదా? * విభజన ద్రోహులైన సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు సమైక్య శంఖారావం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఓట్లు, సీట్ల కోసం, కొడుకును ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అందుకు సహకరిస్తావు. ఒకవైపు సైగ చేసి తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనిపించావు.. మరోవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు సైగ చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేయించావు.. 44 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి నోరు రాలేదా? తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానానికే కాదు ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలతో ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక పార్టీ అధినేతగా ఉండి.. ఒక సమస్యపై ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడించే చంద్రబాబు అసలు నాయకుడేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం నెల్లూరు జిల్లాలో సాగింది. నాయుడుపేట, మునుబోలు, గూడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో జగన్ మాట్లాడారు. సోనియా అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌ను, ప్యాకేజీలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. ఆ భయానక రోజులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి.. ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఆయన పేరు వింటే చంద్రబాబు లాంటి వారి గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడతాయి. ఒకవ్యక్తి చనిపోయి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ చంద్రబాబు వైఎస్‌పై బురద చల్లని రోజు లేదు. జగన్‌ను విమర్శించని రోజు లేదు. అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు, పైఎత్తులు, వెన్నుపోట్లు, కుమ్మక్కు రాజకీయాలనే నమ్ముకున్న చంద్రబాబులాంటి వారికి ... మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ అన్నా, రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారన్నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ భయానక రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. పల్లెలకు వెళ్లినప్పుడు వృద్ధులు నాయనా.. పింఛన్ ఇప్పించు అని ప్రాధేయపడేవారు. అప్పుడు నెలకు రూ.75 పింఛన్ ఇచ్చేవారట. ఆ రూ.75 కోసం ఆ వృద్ధులు అంతగా ప్రాధేయపడే పరిస్థితిని చూసి బాధేసేది. ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేస్తే.. ఆ గ్రామంలో పింఛన్ల కోటా పూర్తయ్యిందని, ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల్లో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మరో వ్యక్తికి పింఛన్ ఇస్తామని చెప్పేవారు. వరుస కరువులతో రైతులు సతమతమవుతున్న సమయంలో.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ ఆ రైతులకు కనీసం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబును కోరితే.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అని హేళన చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. డ్వాక్రా మహిళల నుంచి ముక్కుపిండి మరీ రూపాయిన్నర వడ్డీ వసూలు చేసిన ఆ రాక్షస పాలనను ఎవరూ మర్చిపోలేరు. కూతుర్నిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజులు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 కిలో బియ్య ఇస్తామని చెప్పి.. గెలిచాక కిలో రూ.5.25 చేసిన చంద్రబాబు గుర్తున్నాడు. మద్యపాన నిషేధం నినాదంతో మహిళల ఓట్లు దండుకుని గెలవగానే.. ‘ఈనాడు’లో మద్యనిషేధం అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని వార్తలు రాయించి, పల్లెపల్లెలో బెల్టుషాపులకు తెరతీసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజల గుండె చప్పుడు విన్న నేత వైఎస్.. తొమ్మిదేళ్ల చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించేందుకు దివంగత నేత తన ప్రాణాలను పణంగా పెట్టి ఎర్రటి ఎండల్లో 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అధికారం చేపట్టిన మరుక్షణమే పేదరికానికి వైద్యం చేసే డాక్టరయ్యారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీ పథకం పెట్టారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి చిరునామాగా నిలిచారు. కానీ వైఎస్ మనకు దూరమయ్యాక రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థే చెడిపోయింది. రాజకీయాలంటే ఎత్తులు, జిత్తులతో కూడిన చదరంగంగా మార్చేశారు. అక్రమంగా కేసులు పెడతారు. వ్యక్తులను తప్పిస్తారు. జైలుపాలు చేస్తారు. చివరకు ఓట్లు, సీట్లకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా వెనకాడరు. 44 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో చంద్రబాబు రెండు ప్రాంతాల వారితో రెండు రకాలుగా మాట్లాడిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టి అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. అన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయిందా? ఇక సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా ఒకవైపు విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యవాదిగా, అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న వాడిగా పోజులిస్తారు. రాష్ట్రాన్ని విభజించాలని సోనియా నిర్ణయించి 8 నెలలు కావస్తోంది. ఆరోజే జూలై 30నే మా రాష్ట్రాన్ని విభజించడానికి అంగీకరించనని సోనియా ముఖాన కిరణ్ రాజీనామా లేఖ పడేస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదా? వీరి కుట్రలను ఎవరూ చూడటం లేదనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె చప్పుడు ఒక్కటై ఓ కెరటంలా లేస్తుంది. ఆ కెరటం ఉప్పెనై ఈ కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మనమంతా ఒకటవుదాం. 30 పార్లమెంటు స్థానాలను గెల్చుకుందాం. అప్పుడు రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఎవరు చేస్తారో చూద్దాం. యాత్ర సాగిందిలా శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా కాళహస్తిలో బయల్దేరిన జగన్.. పెళ్లకూరు వద్ద నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. గుర్రపుతోట, చెంబడిపాళెం, ఎగువచావలి తదితర గ్రామాల మీదుగా మధ్యాహ్నానికి నాయుడుపేట చేరుకుని సభలో ప్రసంగించారు. సాయంత్రానికి మునుబోలు సభలో మాట్లాడారు. రాత్రి 8 గంటల సమయంలో గూడూరు చేరుకుని సభలో ప్రసంగించారు. అనంతరం పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. యాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్, పార్టీ నేతలు సంజీవయ్య, కాకాని గోవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు జిల్లాలో శనివారం నాటి యాత్రకు జగన్ విరామం ఇచ్చారని పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది. జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు. -
చివరకు గెలిచేది మంచే: వైఎస్ జగన్
* త్వరలోనే విభజన కుట్రలు పటాపంచలవుతాయి.. చరిత్ర చెబుతున్న పాఠమిదే: జగన్మోహన్రెడ్డి * ప్రజాగ్రహంలో సోనియా, కిరణ్, చంద్రబాబు కొట్టుకుపోతారు.. * రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజల ఘోష వీరెవ్వరికీ వినిపించడంలేదు * వైఎస్ దూరమవడంతోనే రాష్ట్రానికి ఇన్ని కష్టాలొచ్చాయి ‘సమైక్యశంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మా ఇష్టానుసారం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాం’ అనుకుంటున్న సోనియా గాంధీకి, ఆమె అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, కుమ్మక్కు రాజకీయం చేస్తున్న చంద్రబాబులకు ఒకటే చెప్పదలచుకున్నా. మీ అన్యాయపు కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కాలం సాగవు. చివరకు మంచే గెలుస్తుంది. ఇది చరిత్ర చెప్పేపాఠం’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో సాగుతున్న నాలుగోవిడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ పదోరోజు బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సాగింది. ఏర్పేడు, రేణిగుంటల్లో జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను ఎవ్వరిని కదిలించినా వారి గుండెల నుంచి వచ్చే నినాదం ‘జై సమైక్యాంధ్ర’. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగాల కోసం ఎక్కడకు పోవాలని చదువుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి అడుగుల బోరు తవ్వినా నీటి జాడ లేని పరిస్థితుల్లో విభజన జరిగితే సేద్యానికి నీళ్లెక్కడంటూ రైతన్న ఘోషిస్తున్నాడు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజల ఘోష మన ముఖ్యమంత్రికీ వినిపించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకూ వినిపించడం లేదు. మనం ఈ గడ్డపైన పుట్టామే.. విభజన రాజకీయాలు చేస్తే మనకు ఓట్లేసి గెలిపించిన జనం రేపు మన కాలర్ పట్టుకు నిలదీస్తారే అన్న స్పృహకూడా వీరికి లేకపోవడం మన ఖర్మ. అది సువర్ణయుగం.. రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం సువర్ణయుగం ఉండేది. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత వరకూ మన రాష్ట్రం జోలికి వచ్చే దమ్మూ, ధైర్యం ఎవ్వరికీ లేవు. ఒకే ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రంలో ఇంత అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయని జనమంతా ఆ మహానేతను తలచుకుంటున్నారు. అసెంబ్లీ సాగుతున్న తీరు చూస్తే బాధనిపిస్తోంది. చంద్రబాబు అసెంబ్లీలో ఒక చేత్తో సైగచేసి తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత సమైక్యమనిపిస్తారు. మరో చేత్తో సైగచేసి తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర విభజన డిమాండ్ చేయిస్తారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఒక సమస్యపై స్పష్టమైన వైఖరి చెప్పలేనివాడు అసలు నాయకుడెలా అవుతాడు? రాష్ట్రంలో ఉన్న నేతలందరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నేత మనకు దూరం కావడంతో రాష్ట్రంలో ఇంత అస్తవ్యస్త పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మనమే సొంతంగా 30 పార్లమెంటు స్థానాలను గెలుచుకుందాం. అప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం.’’ మూడేళ్లుగా జగన్ కోసం ఎదురుచూపులు.. బుధవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని రామ్‌నగర్ కాలనీ నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. ఏర్పేడులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించాక జగన్ ప్రసంగించారు. తర్వాత అంజిమేడు చేరుకున్నారు. ఈ గ్రామ ప్రజలు మూడేళ్ల క్రితం వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జగన్ చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ జరగాలన్న ఆ గ్రామ ప్రజల కోర్కె బుధవారం నెరవేరింది. తర్వాత జగన్ రేణిగుంట బహిరంగ సభలో ప్రసంగించారు. జీవగ్రాంలో వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మరణించిన మోజెస్ భగవాన్ దాస్ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత చంద్రగిరి నియోజకవర్గం ఆవిలాలలో దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి 11 గంటలకు తుమ్మలకుంటలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదనరెడ్డి, చెవిరెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు డాక్టర్ వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మా సమస్యలను మేనిఫెస్టోలో చేర్చండి’ బుధవారం సమైక్య శంఖారావం యాత్ర దారి పొడవునా మహిళలు బారులు తీరారు. వారందరినీ పేరుపేరునా పలుకరిస్తూ, వారి సమస్యలు వింటూ, మరో నాలుగు నెలల్లో మంచిరోజులొస్తాయని ధైర్యం చెబుతూ జగన్ ముందుకుసాగారు. చెర్లోపల్లి సమీపంలో గీతాకుమారి అనే అంగన్వాడీ కార్యకర్త జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించింది. ‘రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదు. కనీసం మీరైనా మీ పార్టీ మేనిఫెస్టోలో మా సమస్యల పరిష్కారాలను చేర్చండి’ అంటూ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 86 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, 75 వేల మంది ఆయాలు చాలీచాలని జీతాలతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారని తెలిపింది. మీకు ఏ పేరు గుర్తొస్తోంది? చంద్రగిరి నియోజకవర్గంలో దామినీడు చేరుకున్న జగన్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. విశ్వసనీయత, మడమ తిప్పని నైజం అన్న మాటలు విన్నప్పుడు మీకు గుర్తొచ్చే పేరు ఏది అని ప్రజలను ప్రశ్నించారు. జనం పెద్దపెట్టున ‘వైఎస్.. వైఎస్’ అని జవాబిచ్చారు. అలాగే వెన్నుపోటు అన్న మాట విన్నప్పుడు గుర్తుకొచ్చే పేరు ఏదని ప్రశ్నిస్తే.. ‘చంద్రబాబు.. చంద్రబాబు’ అంటూ జనం స్పందించారు. జగన్ తన ఉపన్యాసంలో వైఎస్ గుణగణాలను, చంద్రబాబు నైజాన్ని వివరిస్తున్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. -
ఎమ్మెల్యేలు చెప్పిందే తీర్మానం: వైఎస్ జగన్
* విభజనపై అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు చెప్పేదే చేయండి * సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి * విభజన కోసం రోజుల తరబడి చర్చ ఎందుకు? * ఒక్కరోజు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి పిలవండి * విభజనకు ఒప్పుకుంటారో లేదో అడగండి * ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని చీలుస్తున్నారు * కిరణ్, చంద్రబాబు కళ్లున్న కబోదుల్లా మారారు సమైక్య శంఖారావం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘‘రాష్ట్రాన్ని విభజించడానికి అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు.. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి. ఈ రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటారా.. ఒప్పుకోరా అని వారిని అడగండి. మెజార్టీ సభ్యులు చెప్పిన దాన్నే తీర్మానం చేయండి...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఒక్కరోజులో తేలిపోయే అంశాన్ని రోజుల తరబడి సాగదీస్తూ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ బతికున్నప్పుడు విభజన అనడానికి కూడా సాహసించని వాళ్లు ఈరోజు రాష్ట్రాన్ని చీలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర మూడో విడత ఏడో రోజు శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో సాగింది. పూతలపట్టు నియోజకవర్గం అరగొండ గ్రామంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. అందరి మాట సమైక్యమే.. ‘‘ఈరోజు ప్రతి గొంతు ఒకే మాట మాట్లాడుతోంది.. ప్రతి మనసు ఒకే ఆలోచనతో ఉద్యమబాట పట్టింది. ఆ ఒక్క మాట.. ‘జై సమైక్యాంధ్ర’. ప్రజలంతా సమైక్యాన్ని కోరుకుంటున్నా ఆ విషయం ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకుగానీ, కిరణ్కుమార్రెడ్డికిగానీ అర్థం కావటం లేదు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టుకోవడం కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నా కిరణ్, చంద్రబాబు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు. అందుకే అది సువర్ణయుగం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నారు. సీఎం అయిన తర్వాత పేదవాడికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు హయాంలో అప్పట్లో అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు రూ.70 మాత్రమే పింఛన్ ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 20-30 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఉండే వి కాదు. ఆర్డీవో, ఎమ్మార్వో వద్దకు వెళ్లి.. ‘కేవలం 20-30 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే అవ్వాతాతలు ఎలా బతుకుతారు? పెన్షన్లు పెంచండి’ అని ఎవరైనా అడిగితే ఆ అధికారులు.. ‘కొద్దిగా ఆగండీ.. ఈ మధ్యలో ఎవరో ఒకరు చనిపోతారు. వాళ్లు చనిపోయినప్పుడు మీరు అనుకున్న వాళ్లకే రికమండేషన్ చేసి పంపిస్తాం‘ అని చెప్పేవాళ్లు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల సంఖ్య కేవలం 16 లక్షలు. ఆ తర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. అవ్వాతాతలకు పెద్దకొడుకులా నిలబడ్డారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లు ఏకంగా 78 లక్షలకు తీసుకొని పోయారు. అవ్వా తాతలకు ఒక్కపూట కూడా భోజనం పెట్టకపోతే మన బతుకు ఎందుకు అనుకున్నాడు. రూ.70 ఇచ్చే పెన్షన్‌ను రూ.200 పెంచి ఆ అవ్వాతాతల గుండెల్లో కొలువయ్యాడు. అదీ రామరాజ్యం అంటే. అలాగే విద్యార్థుల గురించి ఆలోచించారు. ప్రతి పేదవాడు ఇంజనీరు, డాక్టర్, కలెక్టర్ వంటి గొప్పగొప్ప చదువులు చదవాలని కలలు కన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి వారికి అండగా నిలిచారు. పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు, రైతన్నలు, చిన్నపిల్లల వరకు కులాలు, ప్రాంతాలకు అతీతంగా మేలు చేశారు. అందుకే ఆయన పాలన సువర్ణయుగం అయింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు వీళ్లు చేస్తున్న అన్యాయాలు, కుళ్లుకుతంత్రాలు ఊరికే పోవు.. పై నుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో 30 పైచిలుకు ఎంపీ స్థానాలను మనమే గెల్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం’’ యాత్ర సాగిందిలా..: శనివారం ఉదయం తిరువణంపల్లె నుంచి బయల్దేరిన జగన్ కాణిపాకం చేరుకున్నారు. శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఎల్.బీ.పురం, ఐరాల క్రాస్, ద్వారకాపురం, మారేడుపల్లె, ఉత్తర బ్రాహ్మణపల్లె వరకు రోడ్ షో నిర్వహించారు. తవణంపల్లెలో జగన్ కాన్వాయ్ దిగి మహిళలు, అభిమానులతో మాట్లాడారు. అక్కడ్నుంచి మట్టపల్లె, ముత్యాలమిట్ట, దిగువ తడకర గ్రామాల మీదుగా మత్యం క్రాస్ చేరుకొని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ దారిలో రైతులతో మాట్లాడారు. మత్యంలో చర్చికి వెళ్లి మత పెద్దల ఆశీర్వచనం తీసుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. అరగొండ చేరుకొని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత రాత్రి బసకు పార్టీ నేత ఎ.ఎస్.మనోహర్ ఇంటికి చేరుకున్నారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత నాలుగో విడత చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర నాలుగో విడత సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. మూడో విడత పర్యటన ఆదివారంతో పూర్తి కానుందని చెప్పారు. పేదోడి గుండెచప్పుడు వినాలి.. ఈరోజు కుళ్లు, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతున్నారు. చదరంగం ఆడుతున్నట్టుగా ప్రాంతాలను విడగొట్టడం, ఒక మనిషిని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టడం, ఒక మనిషిని తప్పించడం.. ఇవి కావు రాజకీయాలంటే. రాజకీయాలంటే విశ్వసనీయత అంటే అర్థం తెలిసి ఉండటం. ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినడం. అతడి మనసు తెలుసుకోవడం. ఆ పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవడం. -
సమైక్యం అంటే జైల్లో పెడతారా ?: వైఎస్ జగన్
* ‘సమైక్య శంఖారావం’లో నిప్పులు చెరిగిన జగన్మోహన్రెడ్డి * నిన్న అసెంబ్లీలో వైఎస్సార్సీపీ * ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రం కోసం నినదిస్తే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు * విభజనకు మేం వ్యతిరేకమని ఒక్క రోజులో తేల్చిపారేయాల్సిన కిరణ్, చంద్రబాబు సాగదీస్తున్నారు * బిల్లుపై చర్చ జరిపించి విభజించేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారు * వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు.. ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చుతూ బిల్లు పంపించారు. ‘అసెంబ్లీలో తీర్మానం లేకుండా బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అంగీకరించినట్టే. చర్చించడం కాదు.. తీర్మానం చేయండి, బిల్లు పెట్టండి, ఓటింగ్ జరపండి’ అని నిన్న అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు.. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో పట్టుపడితే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నాలుగు గంటలు జైల్లో పెట్టారు. ఎందుకు వారిని జైల్లో పెట్టారు? సమైక్యం అన్నందుకా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చర్చ సాఫీగా జరిపించుకోవడం కోసం వైఎస్ విజయమ్మను, ఎమ్మెల్యేలను సస్పెండు చేశారని విమర్శించారు. విభజనకు మేం వ్యతిరేకం అని తీర్మానం చేసి, బిల్లును తిప్పి పంపి ఒక్కరోజులో తేల్చి పారేయాల్సిన చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం అసెంబ్లీని సాగదీస్తూ.. చర్చ జరిపించి రాష్ట్ర విభజనకు అనుమతించడానికి దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఆరో రోజు శుక్రవారం చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొనసాగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల, పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. ఈ అన్యాయాన్ని దేశమంతా చూసేలా చేయండి.. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఎలా దిగజారిపోతారో చెప్పడానికి రాష్ట్రమే ఒక ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఎప్పుడూ కనీవినీ ఎరుగుని అన్యాయం జరుగుతోంది. ఇది మనందరం ఏకం కావాల్సిన సమయం. ఢిల్లీ కుట్రలను ఎదుర్కోవాల్సిన తరుణం. కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ దొంగనాటకాలు ఆడుతున్న తీరును చూస్తున్నాం. సోనియాగాంధీ గీచిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు. చర్చించడమంటే.. విభజనకు అంగీకరించునట్టు కాదా! దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే.. రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి మొత్తంగా శాసనసభ అంతా కలిసి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం దానిమీద చర్య తీసుకొని ప్రతిని రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆ ముసాయిదా బిల్లును మనకు పంపిస్తే దాని మీద తరువాత చర్చ అనేది జరిగితే అప్పుడు ఇలా కాదు, అలా చేయండని చెబితే సమాధానం దొరుకుతుంది. కానీ ఇవాళ రాష్ట్రం విషయంలో.. ఏకంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసేసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర నుంచి మనకు పంపించి ఇక మీరు చర్చించుకోండి అని చెప్తున్నారు. చర్చించడం అంటే దాని అర్థం విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా..! అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించండి.. నేను ఇక్కడికి వచ్చే ముందు దారి వెంట చాలా మంది అక్కచెల్లమ్మలు నన్ను చూడటానికి వచ్చారు. ‘అన్నా గ్యాసు సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1360 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చెప్పారు. నన్ను కలిసిన రైతన్నలను నీళ్ల పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘వెయ్యి అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు వస్తాయో.. రావో.. తెలియని పరిస్థితిలో ఉన్నామన్నా’ అని చెప్పారు. కరెంటు పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘మూడు నాలుగు గంటలకు మించి ఇవ్వరన్నా’ అని చెప్తున్నారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త ఇల్లు లేదు, గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీనీవా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితే తప్ప కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఈ సమస్యలపై చర్చ పెట్టండి. వాటి మీద మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడనే మాట్లాడరట. కానీ రాష్ట్రాన్ని ఎలా విభజించాలని మాత్రం చర్చిస్తారట. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం.. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు ఒక్క మాట చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుమ్మక్కులు, ఎన్ని కుయుక్తులు చేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రజలందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. కుమ్మక్కు రాజకీయాలను, ఢిల్లీ కోటను బద్ధలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’ జోరుగా జగన్ యాత్ర సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగింది. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఉదయం యాత్రను ప్రారంభించిన జగన్.. పాకాలలో విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత బస్టాండ్ సెంటర్లో ప్రసంగించారు. తర్వాత సామిరెడ్డిపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. పూతలపట్టులో జరిగిన సభలో ప్రసంగించారు. అనంతరం దిగువపాలకూర, మూర్తిగారిపల్లెల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రి తిరువణంపల్లెలో బస చేశారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్రెడ్డి, నాయకులు మిథున్‌రెడ్డ్డి, చెవిరెడ్డి, సునీల్ కుమార్, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉన్నారు. బాబు మాట విని బాధనిపించింది.. ‘‘పదేళ్లలో రాజధాని వదిలిపెట్టి వెళ్లాలని చెప్తున్నారు. చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలని చంద్రబాబును అడిగితే ఆయన ‘ఏం పక్కన.. కర్ణాటక లేదా? చైన్నై లేదా? మన పిల్లలు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకోలేరా?’ అని అన్నారట. చంద్రబాబు నోట ఇటువంటి మాటలు రావడం చూసి బాధనిపించింది. చంద్రబాబూ.. మీ కుప్పం నియోజకవర్గం పక్కనే తమిళనాడు ఉంది. మీరు సామాన్యుడిగా ఒక్కసారి చెన్నై వెళ్లండి, అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కారులో తిరగండి. వాళ్లు నిన్ను ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చూడండి. ఒక్కసారి చెన్నైలో తమిళం మాట్లాడకుండా, కర్ణాటక వెళ్లి కన్నడం మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే అక్కడి వాళ్లు మనల్ని ఎలా చూస్తారో ఆలోచన చేయండి. భాష రాని చోటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఎన్నెన్ని కష్టాలు పడాల్సి వస్తుంది.’’ - వైఎస్ జగన్ -
'తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లే'
చిత్తూరు : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆయన బుధవారం చిత్తూరు జిల్లా సోమల బహిరంగ సభలో మాట్లాడుతూ విజభన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరే గతన్నారు. మన నీటి కోసం మనమే తన్నుకోవాలా?, విభజన జరిగితే సాగుకు నీళ్లుండవని అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రిని చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. తెలుగు రాని సోనియాగాంధీ, తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
కుప్పం జనసంద్రం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జగన్ రాకతో కుప్పం జనసంద్రమైంది. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్దాచిన్న, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గంలో ఆదివారం రెండోరోజు జగన్ చేపట్టిన సమైక్య శం ఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. కుప్పం ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన యాత్ర శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 20కి పైగా గ్రామాల మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని వెంకటగిరి కోట వరకూ సాగింది. శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో జగన్.. వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. జనం అడుగడుగునా స్వాగతం పలకడంతో వి.కోటలో మధ్యాహ్నం 2 కు జరగాల్సిన సభ రాత్రి 8 గంటలకు జరిగింది. అనంతరం జగన్ రాత్రి బస కోసం దగ్గర్లోని పట్రాపల్లెలో ఉన్న పార్టీ నేత వాసు ఇంటికి వెళ్లారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు. -
నేడు జగన్ పర్యటన ఇలా..
సాక్షి, తిరుపతి: జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం కుప్పంలోని ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ప్రారంభమవుతుంది. శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శాంతిపురం చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపు రెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకుల పల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో రోడ్ షో నిర్వహిస్తారు.