సమైక్యం అంటే జైల్లో పెడతారా ?: వైఎస్ జగన్‌ | Ys Jagan mohan reddy slams congress government | Sakshi
Sakshi News home page

సమైక్యం అంటే జైల్లో పెడతారా ?: వైఎస్ జగన్‌

Published Sat, Jan 11 2014 3:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Ys Jagan mohan reddy slams congress government

* ‘సమైక్య శంఖారావం’లో నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
* నిన్న అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ
* ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రం కోసం నినదిస్తే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు
* విభజనకు మేం వ్యతిరేకమని ఒక్క రోజులో  తేల్చిపారేయాల్సిన కిరణ్, చంద్రబాబు సాగదీస్తున్నారు
* బిల్లుపై చర్చ జరిపించి విభజించేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారు
* వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు..

 

 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చుతూ బిల్లు పంపించారు. ‘అసెంబ్లీలో తీర్మానం లేకుండా బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అంగీకరించినట్టే. చర్చించడం కాదు.. తీర్మానం చేయండి, బిల్లు పెట్టండి, ఓటింగ్ జరపండి’ అని నిన్న అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు.. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో పట్టుపడితే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నాలుగు గంటలు జైల్లో పెట్టారు. ఎందుకు వారిని జైల్లో పెట్టారు? సమైక్యం అన్నందుకా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
 
 చర్చ సాఫీగా జరిపించుకోవడం కోసం వైఎస్ విజయమ్మను, ఎమ్మెల్యేలను సస్పెండు చేశారని విమర్శించారు. విభజనకు మేం వ్యతిరేకం అని తీర్మానం చేసి, బిల్లును తిప్పి పంపి ఒక్కరోజులో తేల్చి పారేయాల్సిన చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం అసెంబ్లీని సాగదీస్తూ.. చర్చ జరిపించి రాష్ట్ర విభజనకు అనుమతించడానికి దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఆరో రోజు శుక్రవారం చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొనసాగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల, పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఈ అన్యాయాన్ని దేశమంతా చూసేలా చేయండి..
 ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఎలా దిగజారిపోతారో చెప్పడానికి రాష్ట్రమే ఒక ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఎప్పుడూ కనీవినీ ఎరుగుని అన్యాయం జరుగుతోంది. ఇది మనందరం ఏకం కావాల్సిన సమయం. ఢిల్లీ కుట్రలను ఎదుర్కోవాల్సిన తరుణం. కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ దొంగనాటకాలు ఆడుతున్న తీరును చూస్తున్నాం. సోనియాగాంధీ గీచిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు.
 
 చర్చించడమంటే.. విభజనకు అంగీకరించునట్టు కాదా!
 దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే.. రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి మొత్తంగా శాసనసభ అంతా కలిసి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం దానిమీద చర్య తీసుకొని ప్రతిని రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆ ముసాయిదా బిల్లును మనకు పంపిస్తే దాని మీద తరువాత చర్చ అనేది జరిగితే అప్పుడు ఇలా కాదు, అలా చేయండని చెబితే సమాధానం దొరుకుతుంది. కానీ ఇవాళ రాష్ట్రం విషయంలో.. ఏకంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసేసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర నుంచి మనకు పంపించి ఇక మీరు చర్చించుకోండి అని చెప్తున్నారు. చర్చించడం అంటే దాని అర్థం విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా..!
 
 అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించండి..
 నేను ఇక్కడికి వచ్చే ముందు దారి వెంట చాలా మంది అక్కచెల్లమ్మలు నన్ను చూడటానికి వచ్చారు. ‘అన్నా గ్యాసు సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1360 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చెప్పారు. నన్ను కలిసిన రైతన్నలను నీళ్ల పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘వెయ్యి అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు వస్తాయో.. రావో.. తెలియని పరిస్థితిలో ఉన్నామన్నా’ అని చెప్పారు. కరెంటు పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘మూడు నాలుగు గంటలకు మించి ఇవ్వరన్నా’ అని చెప్తున్నారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త ఇల్లు లేదు, గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీనీవా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితే తప్ప కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఈ సమస్యలపై చర్చ పెట్టండి. వాటి మీద మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడనే మాట్లాడరట. కానీ  రాష్ట్రాన్ని ఎలా విభజించాలని మాత్రం చర్చిస్తారట.
 
 ఢిల్లీ కోటను బద్దలు కొడదాం..
 రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు ఒక్క మాట చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుమ్మక్కులు, ఎన్ని కుయుక్తులు చేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రజలందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. కుమ్మక్కు రాజకీయాలను, ఢిల్లీ కోటను బద్ధలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’
 
 జోరుగా జగన్ యాత్ర
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగింది. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఉదయం యాత్రను ప్రారంభించిన జగన్.. పాకాలలో విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగించారు. తర్వాత సామిరెడ్డిపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. పూతలపట్టులో జరిగిన సభలో ప్రసంగించారు. అనంతరం దిగువపాలకూర, మూర్తిగారిపల్లెల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రి తిరువణంపల్లెలో బస చేశారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు మిథున్‌రెడ్డ్డి, చెవిరెడ్డి, సునీల్ కుమార్, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 బాబు మాట విని  బాధనిపించింది..
 ‘‘పదేళ్లలో రాజధాని వదిలిపెట్టి వెళ్లాలని చెప్తున్నారు. చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలని చంద్రబాబును అడిగితే ఆయన ‘ఏం పక్కన.. కర్ణాటక లేదా? చైన్నై  లేదా? మన పిల్లలు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకోలేరా?’ అని అన్నారట. చంద్రబాబు నోట ఇటువంటి మాటలు రావడం చూసి బాధనిపించింది. చంద్రబాబూ.. మీ కుప్పం నియోజకవర్గం పక్కనే తమిళనాడు ఉంది. మీరు  సామాన్యుడిగా ఒక్కసారి చెన్నై వెళ్లండి, అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కారులో తిరగండి. వాళ్లు నిన్ను ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చూడండి. ఒక్కసారి చెన్నైలో తమిళం మాట్లాడకుండా, కర్ణాటక వెళ్లి కన్నడం మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే అక్కడి వాళ్లు మనల్ని ఎలా చూస్తారో ఆలోచన చేయండి. భాష రాని చోటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఎన్నెన్ని కష్టాలు పడాల్సి వస్తుంది.’’    
- వైఎస్ జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement