చివరకు గెలిచేది మంచే: వైఎస్ జగన్
* త్వరలోనే విభజన కుట్రలు పటాపంచలవుతాయి.. చరిత్ర చెబుతున్న పాఠమిదే: జగన్‌మోహన్‌రెడ్డి
* ప్రజాగ్రహంలో సోనియా, కిరణ్, చంద్రబాబు కొట్టుకుపోతారు..
* రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజల ఘోష వీరెవ్వరికీ వినిపించడంలేదు
* వైఎస్ దూరమవడంతోనే రాష్ట్రానికి ఇన్ని కష్టాలొచ్చాయి
‘సమైక్యశంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మా ఇష్టానుసారం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాం’ అనుకుంటున్న సోనియా గాంధీకి, ఆమె అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, కుమ్మక్కు రాజకీయం చేస్తున్న చంద్రబాబులకు ఒకటే చెప్పదలచుకున్నా. మీ అన్యాయపు కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కాలం సాగవు. చివరకు మంచే గెలుస్తుంది. ఇది చరిత్ర చెప్పేపాఠం’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో సాగుతున్న నాలుగోవిడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ పదోరోజు బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సాగింది. ఏర్పేడు, రేణిగుంటల్లో జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్రంలో విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను ఎవ్వరిని కదిలించినా వారి గుండెల నుంచి వచ్చే నినాదం ‘జై సమైక్యాంధ్ర’. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగాల కోసం ఎక్కడకు పోవాలని చదువుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి అడుగుల బోరు తవ్వినా నీటి జాడ లేని పరిస్థితుల్లో విభజన జరిగితే సేద్యానికి నీళ్లెక్కడంటూ రైతన్న ఘోషిస్తున్నాడు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజల ఘోష మన ముఖ్యమంత్రికీ వినిపించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకూ వినిపించడం లేదు. మనం ఈ గడ్డపైన పుట్టామే.. విభజన రాజకీయాలు చేస్తే మనకు ఓట్లేసి గెలిపించిన జనం రేపు మన కాలర్ పట్టుకు నిలదీస్తారే అన్న స్పృహకూడా వీరికి లేకపోవడం మన ఖర్మ.
అది సువర్ణయుగం..
రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం సువర్ణయుగం ఉండేది. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత వరకూ మన రాష్ట్రం జోలికి వచ్చే దమ్మూ, ధైర్యం ఎవ్వరికీ లేవు. ఒకే ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రంలో ఇంత అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయని జనమంతా ఆ మహానేతను తలచుకుంటున్నారు. అసెంబ్లీ సాగుతున్న తీరు చూస్తే బాధనిపిస్తోంది. చంద్రబాబు అసెంబ్లీలో ఒక చేత్తో సైగచేసి తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత సమైక్యమనిపిస్తారు. మరో చేత్తో సైగచేసి తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర విభజన డిమాండ్ చేయిస్తారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఒక సమస్యపై స్పష్టమైన వైఖరి చెప్పలేనివాడు అసలు నాయకుడెలా అవుతాడు? రాష్ట్రంలో ఉన్న నేతలందరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నేత మనకు దూరం కావడంతో రాష్ట్రంలో ఇంత అస్తవ్యస్త పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మనమే సొంతంగా 30 పార్లమెంటు స్థానాలను గెలుచుకుందాం. అప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం.’’
మూడేళ్లుగా జగన్ కోసం ఎదురుచూపులు..
బుధవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని రామ్‌నగర్ కాలనీ నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. ఏర్పేడులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించాక జగన్ ప్రసంగించారు. తర్వాత అంజిమేడు చేరుకున్నారు. ఈ గ్రామ ప్రజలు మూడేళ్ల క్రితం వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జగన్ చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ జరగాలన్న ఆ గ్రామ ప్రజల కోర్కె బుధవారం నెరవేరింది. తర్వాత జగన్ రేణిగుంట బహిరంగ సభలో ప్రసంగించారు. జీవగ్రాంలో వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మరణించిన మోజెస్ భగవాన్ దాస్ కుటుంబాన్ని ఓదార్చారు.
తర్వాత చంద్రగిరి నియోజకవర్గం ఆవిలాలలో దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి 11 గంటలకు తుమ్మలకుంటలో వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదనరెడ్డి, చెవిరెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు డాక్టర్ వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మా సమస్యలను మేనిఫెస్టోలో చేర్చండి’
బుధవారం సమైక్య శంఖారావం యాత్ర దారి పొడవునా మహిళలు బారులు తీరారు. వారందరినీ పేరుపేరునా పలుకరిస్తూ, వారి సమస్యలు వింటూ, మరో నాలుగు నెలల్లో మంచిరోజులొస్తాయని ధైర్యం చెబుతూ జగన్ ముందుకుసాగారు. చెర్లోపల్లి సమీపంలో గీతాకుమారి అనే అంగన్‌వాడీ కార్యకర్త జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించింది. ‘రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదు. కనీసం మీరైనా మీ పార్టీ మేనిఫెస్టోలో మా సమస్యల పరిష్కారాలను చేర్చండి’ అంటూ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 86 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 75 వేల మంది ఆయాలు చాలీచాలని జీతాలతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారని తెలిపింది.
మీకు ఏ పేరు గుర్తొస్తోంది?
చంద్రగిరి నియోజకవర్గంలో దామినీడు చేరుకున్న జగన్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. విశ్వసనీయత, మడమ తిప్పని నైజం అన్న మాటలు విన్నప్పుడు మీకు గుర్తొచ్చే పేరు ఏది అని ప్రజలను ప్రశ్నించారు. జనం పెద్దపెట్టున ‘వైఎస్.. వైఎస్’ అని జవాబిచ్చారు. అలాగే వెన్నుపోటు అన్న మాట విన్నప్పుడు గుర్తుకొచ్చే పేరు ఏదని ప్రశ్నిస్తే.. ‘చంద్రబాబు.. చంద్రబాబు’ అంటూ జనం స్పందించారు. జగన్ తన ఉపన్యాసంలో వైఎస్ గుణగణాలను, చంద్రబాబు నైజాన్ని వివరిస్తున్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.