(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): కుట్ర బట్టబయలైంది. ఎదిరించిన వారిని అణిచేయాలన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. అవసరానికి ఎవరితోనైనా అంటకాగే టీడీపీ అధిపతి చంద్రబాబు కలిసి ఏ స్థాయిలో కుట్ర చేశారన్నది ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో స్పష్టమయింది. ఎందుకంటే.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై కేసులు.. వెంటాడటం.. దుష్ప్రచారం ఇవన్నీ మొదలైంది 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులతోనే!!. ‘సాక్షి’ మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ వాటిపై పన్ను చెల్లించాలని నోటీసులిచ్చారాయన. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రభుత్వం నుంచి పలు ప్రాజెక్టులు దక్కాయని, అందుకు క్విడ్ ప్రోకోగా వారు షేర్లను రూ.350 ప్రీమియంతో కొన్నారని.. కాబట్టి ఆ ప్రీమియంపై పన్ను చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. నిజానికి పెట్టుబడులన్నీ 2008–09 అసెస్‌మెంట్ ఇయర్లో వచ్చాయి. దీనికి సంబంధించి ఐటీ ఉత్తర్వులు ఎప్పుడిచ్చారో తెలుసా? 2011లో వైఎస్ జగన్ కాంగ్రెస్ అధినేత్రితో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక!!.
ఎల్లో మీడియా ద్వారా లీకులు
ఐటీ నోటీసుల్ని ఐటీ వ్యవస్థ ద్వారానే సవాలు చేసి ఎదుర్కొంది ‘సాక్షి’ యాజమాన్య సంస్థ జగతి పబ్లికేషన్స్. జగన్ తమ దార్లోకి వస్తారేమోనని కాంగ్రెస్ ఎదురుచూసింది. రాకపోవటంతో ఆరు నెలలు గడిచాక ఐటీ నోటీసులపై ఎల్లో మీడియాలో లీకులు మొదలయ్యాయి. క్విడ్ ప్రోకోగానే పెట్టుబడులు వచ్చాయంటూ కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ రెండో అడుగువేసింది..! ఎల్లో మీడియా కథనాల్ని... ఐటీ నోటీసుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. క్విడ్‌ప్రోకో వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరగా, హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
జత కలిసిన చంద్రబాబు
వైఎస్ వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి నానాటికీ బలపడుతుండటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్‌తో లాలూచీపడ్డారు. వైఎస్ జగన్‌ను ఇరికించడానికి.. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసులో తమనూ పిటిషనర్లుగా చేర్చాలంటూ తమ పార్టీ నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు చేత ఇంప్లీడ్ పిటిషన్ వేయించారు. అలా... కుట్రలో రెండో అంకాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. తదనంతరం కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల చేత సమగ్రంగా విచారణ జరిపించాలని ఉత్తర్వులిచ్చింది.
అందరికీ పదోన్నతులే..!
లేఖ రాసిన శంకర్రావుకు మంత్రి పదవి దక్కింది. టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు దురదృష్టవశాత్తూ 2012లో ప్రమాదంలో మరణించగా... అదే సంవత్సరంలో బైరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2014లో టీడీపీ గెలిచాక అశోక్ గజపతికి కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. మరీ ముఖ్యమైన అంశమేంటంటే.. పెట్టుబడులను ఆదాయంగా పరిగణించి పన్ను కట్టాలంటూ నోటీసులిచ్చిన ఐటీ అధికారి జాస్తి కృష్ణకిషోర్... తన కేంద్ర సర్వీసుల్లో భాగంగా అప్పట్లో టీడీపీ తరపున కేంద్ర విమానయాన మంత్రి అయిన అశోక్ గజపతిరాజు వద్ద కార్యదర్శిగా చేరారు. అయితే తొలిసారిగా తన నోటీసుల్లో ‘క్విడ్ ప్రో కో’ పదం వాడి.. దాన్ని వైఎస్ జగన్‌పై విచారణ వరకూ తీసుకెళ్ళడానికి సహకరించినందుకు ఏడాది తిరగకుండా కృష్ణకిషోర్‌ను రాష్ట్ర సర్వీసుల్లోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థకు(ఎన్‌డీబీ) సీఈవోగా చేశారు. ఏడీబీ ఈసీవోగా ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. 2019లో టీడీపీ ఓడిపోగానే జాస్తి కిశోర్ మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవటం గమనార్హం.
సీబీఐ–ఐటీ.. దొందూ దొందే!!
చిత్రమేంటంటే సీబీఐ తన విచారణలో భాగంగా చేయకూడనివెన్నో చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. అసలు వైఎస్ జగన్‌ను ఒక్కసారి కూడా విచారించకుండానే ఆయనపై ఛార్జిషీట్లు వేసేసింది. లీకులిస్తూ ఎల్లో మీడియాలో భయంకరమైన దుష్ప్రచారాన్ని సాగించింది. సాక్షిని అణచేయటానికి.. ఖాతాల్ని స్తంభించటం సహా చేయగలిగినవన్నీ చేసింది. వీటికితోడు క్విడ్‌ప్రోకో ఆరోపణలను ఐటీ విభాగం తన దర్యాప్తులో నిరూపించేసినట్లు సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొనటం గమనార్హం. ఐటీ విభాగం కూడా తాను తక్కువ తినలేదన్నట్లు.. సీబీఐ క్విడ్ ప్రోకో ఆరోపణలన్నింటినీ దర్యాప్తులో నిగ్గు తేల్చిందని తన అఫిడవిట్లలో పేర్కొంది.
సోషల్ మీడియాలో టీడీపీ అతి!!
నిజానికి ఐటీ ట్రిబ్యునల్ గతనెల 23నే ఉత్తర్వులిచ్చింది. ఇదంతా న్యాయపరంగా జరిగే ప్రక్రియ కావటంతో ‘సాక్షి’ కూడా బహిరంగ ప్రచారమెందుకని ఊరుకుంది. కాకపోతే సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో ప్రధాని మోదీని కలిశాక ఈ తీర్పు వచ్చిందంటూ టీడీపీ ఎల్లో ముఠాలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి దిగాయి. మరీ ఈ స్థాయి వికృతానందానికి దాసోహమైన టీడీపీని ఏమనాలన్నది అర్థం చేసుకోవటం కూడా కష్టమే.
ట్రిబ్యునల్ తీర్పుతో బట్టబయలు
మొత్తానికి ఇవన్నీ ట్రిబ్యునల్ తీర్పులో బట్టబయలయ్యాయి. సీబీఐ ఛార్జిషీట్లోనివన్నీ కేవలం ఆరోపణలేనని పేర్కొన్న ట్రిబ్యునల్ బెంచ్.. అసలు పదేళ్లు దాటినా క్విడ్ ప్రోకో ఆరోపణల్ని దర్యాప్తు చేసి ఎందుకు తేల్చలేకపోయారని, దానికి తగ్గ ఆధారాలను ఎందుకు సమర్పించలేదని ఐటీ విభాగాన్ని నిలదీసింది. అంతేకాదు!! ‘సాక్షి’ మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ చట్టప్రకారమే వచ్చాయని... చట్టబద్ధంగా అన్ని నిబంధనలనూ పాటించాకే ఇన్వెస్ట్‌మెంట్లు స్వీకరించారని స్పష్టంచేసింది. అప్పట్లో ‘సాక్షి’ యాజమాన్యం ఇన్వెస్టర్లకు చెప్పినవన్నీ ఆ తరువాతి కాలంలో వాస్తవాలుగా నిగ్గుదేలాయని.. షేరు విలువను కూడా నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయించారని స్పష్టం చేసింది. ఇది చాలదూ.. ఈ ఎల్లో కుట్రను బయటపెట్టడానికి? వీరి పన్నాగాన్ని అర్థం చేసుకోవటానికి?
Comments
Please login to add a commentAdd a comment