చక్ర బంధంలో చంద్రబాబు! | IT department to issue notices to Chandrababu | Sakshi
Sakshi News home page

చక్ర బంధంలో చంద్రబాబు!

Published Sat, Mar 7 2020 3:52 AM | Last Updated on Sat, Mar 7 2020 7:52 AM

IT department to issue notices to Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్‌–13ఏ ప్రకారం రాజకీయ పార్టీలు రూ.2,000 వరకూ విరాళాలను నగదు రూపంలో తీసుకోవచ్చు. అంతకంటే అధిక మొత్తాన్ని విరాళంగా స్వీకరించాల్సి వస్తే చెక్‌ రూపంలో గానీ.. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా గానీ.. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు హవాలా మార్గంలో రూ.550 కోట్లను ఎన్నికల విరాళంగా చేరవేసినట్లు బాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌) పెండ్యాల శ్రీనివాస్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డాక్యుమెంట్ల ద్వారా ఐటీ శాఖ గుర్తించింది.

నిబంధనలకు విరుద్ధంగా రూ.550 కోట్లను విరాళంగా సేకరించడంపై విచారణకు హాజరు కావాలని సెక్షన్‌–131 కింద ఐటీ శాఖ తొలుత ఫిబ్రవరి 11న అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. రెండోసారి ఫిబ్రవరి 18న ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుకూ అహ్మద్‌ పటేల్‌ స్పందించలేదు. దాంతో మార్చి 5న ఐటీ శాఖ మరోసారి నోటీసు జారీ చేసింది. ఈసారి విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అహ్మద్‌ పటేల్‌ను హెచ్చరించింది. అహ్మద్‌ పటేల్‌ను విచారించిన తర్వాత ఆయనకు హవాలా మార్గంలో నిధులు చేరవేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి, విచారిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

- ఐటీ శాఖ ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు కాంట్రాక్టు సంస్థల్లో సోదాలు చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్‌  పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, నారా లోకేశ్‌ సన్నిహితుడు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి(డీఎన్‌సీ ఇన్‌ఫ్రా), మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌(అవెక్సా ఇన్‌ఫ్రా) నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. 
- పెండ్యాల శ్రీనివాస్‌ ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీగా అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.550 కోట్లను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ద్వారా హవాలా మార్గంలో చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వాటి ఆధారంగానే అహ్మద్‌ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేశారు. 
ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లుగా వసూలు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఖర్చుల కోసం చంద్రబాబు సమకూర్చారని ‘సాక్షి’ అప్పట్లోనే వెల్లడించింది. 
- హవాలా మార్గంలో చంద్రబాబు చేరవేసిన నిధులను అహ్మద్‌ పటేల్‌.. అదే పద్ధతిలో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహిత కాంట్రాక్టు సంస్థలకు, కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే డీకే శివకుమార్‌ను ఈ అంశంపై విచారించిన ఐటీ శాఖ.. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌తోపాటు ఆయన సన్నిహిత కాంట్రాక్టు సంస్థలను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. 
అహ్మద్‌ పటేల్‌ను, కమల్‌నాథ్‌ సన్నిహితులను విచారించిన తర్వాత.. అక్రమ లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది. 
- విచారణలో చంద్రబాబు వెల్లడించే అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 

రంగంలోకి ఎస్‌ఎఫ్‌ఐవో! 
- చంద్రబాబు నిర్వహించిన హవాలా రాకెట్‌ను తీవ్రమైన ఆర్థిక నేరంగా సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసు(ఎస్‌ఎఫ్‌ఐవో) పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమైంది. 
- ఐటీకి సమాంతరంగా ఈ నేరంపై విచారణ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐవో డైరెక్టర్‌ అమర్‌దీప్‌సింగ్‌ భాటియా నిర్ణయించారు. 
చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎస్‌ఎఫ్‌ఐవో బృందాలు రంగంలోకి దిగనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement