* సమైక్య శంఖారావంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు
* ప్రతిపక్ష నాయకుడిగా ఉండి విభజనకు సహకరిస్తావు
* ఒక ప్రాంతం వారితో తెలంగాణ అనిపించావు..
* మరోప్రాంతం వారితో సమైక్యాంధ్ర అనిపించావు
* 44 రోజులపాటు సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అనడానికి నోరు రాలేదా?
* విభజన ద్రోహులైన సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు
సమైక్య శంఖారావం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఓట్లు, సీట్ల కోసం, కొడుకును ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అందుకు సహకరిస్తావు. ఒకవైపు సైగ చేసి తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనిపించావు.. మరోవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు సైగ చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేయించావు.. 44 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి నోరు రాలేదా? తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానానికే కాదు ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలతో ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఒక పార్టీ అధినేతగా ఉండి.. ఒక సమస్యపై ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడించే చంద్రబాబు అసలు నాయకుడేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం నెల్లూరు జిల్లాలో సాగింది. నాయుడుపేట, మునుబోలు, గూడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో జగన్ మాట్లాడారు. సోనియా అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌ను, ప్యాకేజీలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ఆ భయానక రోజులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి..
‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఆయన పేరు వింటే చంద్రబాబు లాంటి వారి గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడతాయి. ఒకవ్యక్తి చనిపోయి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ చంద్రబాబు వైఎస్‌పై బురద చల్లని రోజు లేదు. జగన్‌ను విమర్శించని రోజు లేదు. అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు, పైఎత్తులు, వెన్నుపోట్లు, కుమ్మక్కు రాజకీయాలనే నమ్ముకున్న చంద్రబాబులాంటి వారికి ... మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ అన్నా, రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారన్నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ భయానక రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. పల్లెలకు వెళ్లినప్పుడు వృద్ధులు నాయనా.. పింఛన్ ఇప్పించు అని ప్రాధేయపడేవారు.
అప్పుడు నెలకు రూ.75 పింఛన్ ఇచ్చేవారట. ఆ రూ.75 కోసం ఆ వృద్ధులు అంతగా ప్రాధేయపడే పరిస్థితిని చూసి బాధేసేది. ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేస్తే.. ఆ గ్రామంలో పింఛన్ల కోటా పూర్తయ్యిందని, ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల్లో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మరో వ్యక్తికి పింఛన్ ఇస్తామని చెప్పేవారు. వరుస కరువులతో రైతులు సతమతమవుతున్న సమయంలో.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ ఆ రైతులకు కనీసం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబును కోరితే.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అని హేళన చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. డ్వాక్రా మహిళల నుంచి ముక్కుపిండి మరీ రూపాయిన్నర వడ్డీ వసూలు చేసిన ఆ రాక్షస పాలనను ఎవరూ మర్చిపోలేరు.
కూతుర్నిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజులు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 కిలో బియ్య ఇస్తామని చెప్పి.. గెలిచాక కిలో రూ.5.25 చేసిన చంద్రబాబు గుర్తున్నాడు. మద్యపాన నిషేధం నినాదంతో మహిళల ఓట్లు దండుకుని గెలవగానే.. ‘ఈనాడు’లో మద్యనిషేధం అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని వార్తలు రాయించి, పల్లెపల్లెలో బెల్టుషాపులకు తెరతీసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.
ప్రజల గుండె చప్పుడు విన్న నేత వైఎస్..
తొమ్మిదేళ్ల చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించేందుకు దివంగత నేత తన ప్రాణాలను పణంగా పెట్టి ఎర్రటి ఎండల్లో 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అధికారం చేపట్టిన మరుక్షణమే పేదరికానికి వైద్యం చేసే డాక్టరయ్యారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీ పథకం పెట్టారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి చిరునామాగా నిలిచారు. కానీ వైఎస్ మనకు దూరమయ్యాక రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థే చెడిపోయింది. రాజకీయాలంటే ఎత్తులు, జిత్తులతో కూడిన చదరంగంగా మార్చేశారు. అక్రమంగా కేసులు పెడతారు. వ్యక్తులను తప్పిస్తారు. జైలుపాలు చేస్తారు. చివరకు ఓట్లు, సీట్లకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా వెనకాడరు. 44 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో చంద్రబాబు రెండు ప్రాంతాల వారితో రెండు రకాలుగా మాట్లాడిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టి అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు.
అన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘జై సమైక్యాంధ్ర’ అన్న ఒక్క పదం అనడానికి చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయిందా? ఇక సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా ఒకవైపు విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యవాదిగా, అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న వాడిగా పోజులిస్తారు. రాష్ట్రాన్ని విభజించాలని సోనియా నిర్ణయించి 8 నెలలు కావస్తోంది. ఆరోజే జూలై 30నే మా రాష్ట్రాన్ని విభజించడానికి అంగీకరించనని సోనియా ముఖాన కిరణ్ రాజీనామా లేఖ పడేస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదా? వీరి కుట్రలను ఎవరూ చూడటం లేదనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె చప్పుడు ఒక్కటై ఓ కెరటంలా లేస్తుంది. ఆ కెరటం ఉప్పెనై ఈ కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మనమంతా ఒకటవుదాం. 30 పార్లమెంటు స్థానాలను గెల్చుకుందాం. అప్పుడు రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఎవరు చేస్తారో చూద్దాం.
యాత్ర సాగిందిలా
శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా కాళహస్తిలో బయల్దేరిన జగన్.. పెళ్లకూరు వద్ద నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. గుర్రపుతోట, చెంబడిపాళెం, ఎగువచావలి తదితర గ్రామాల మీదుగా మధ్యాహ్నానికి నాయుడుపేట చేరుకుని సభలో ప్రసంగించారు.
సాయంత్రానికి మునుబోలు సభలో మాట్లాడారు. రాత్రి 8 గంటల సమయంలో గూడూరు చేరుకుని సభలో ప్రసంగించారు. అనంతరం పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. యాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్, పార్టీ నేతలు సంజీవయ్య, కాకాని గోవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు జిల్లాలో శనివారం నాటి యాత్రకు జగన్ విరామం ఇచ్చారని పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.