* విభజనపై అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు చెప్పేదే చేయండి
* సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* విభజన కోసం రోజుల తరబడి చర్చ ఎందుకు?
* ఒక్కరోజు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి పిలవండి
* విభజనకు ఒప్పుకుంటారో లేదో అడగండి
* ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని చీలుస్తున్నారు
* కిరణ్, చంద్రబాబు కళ్లున్న కబోదుల్లా మారారు
సమైక్య శంఖారావం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘‘రాష్ట్రాన్ని విభజించడానికి అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు.. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి. ఈ రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటారా.. ఒప్పుకోరా అని వారిని అడగండి. మెజార్టీ సభ్యులు చెప్పిన దాన్నే తీర్మానం చేయండి...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఒక్కరోజులో తేలిపోయే అంశాన్ని రోజుల తరబడి సాగదీస్తూ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ బతికున్నప్పుడు విభజన అనడానికి కూడా సాహసించని వాళ్లు ఈరోజు రాష్ట్రాన్ని చీలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర మూడో విడత ఏడో రోజు శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో సాగింది. పూతలపట్టు నియోజకవర్గం అరగొండ గ్రామంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
అందరి మాట సమైక్యమే..
‘‘ఈరోజు ప్రతి గొంతు ఒకే మాట మాట్లాడుతోంది.. ప్రతి మనసు ఒకే ఆలోచనతో ఉద్యమబాట పట్టింది. ఆ ఒక్క మాట.. ‘జై సమైక్యాంధ్ర’. ప్రజలంతా సమైక్యాన్ని కోరుకుంటున్నా ఆ విషయం ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకుగానీ, కిరణ్‌కుమార్‌రెడ్డికిగానీ అర్థం కావటం లేదు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టుకోవడం కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నా కిరణ్, చంద్రబాబు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు.
అందుకే అది సువర్ణయుగం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నారు.
సీఎం అయిన తర్వాత పేదవాడికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు హయాంలో అప్పట్లో అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు రూ.70 మాత్రమే పింఛన్ ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 20-30 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఉండే వి కాదు. ఆర్డీవో, ఎమ్మార్వో వద్దకు వెళ్లి.. ‘కేవలం 20-30 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే అవ్వాతాతలు ఎలా బతుకుతారు? పెన్షన్లు పెంచండి’ అని ఎవరైనా అడిగితే ఆ అధికారులు.. ‘కొద్దిగా ఆగండీ.. ఈ మధ్యలో ఎవరో ఒకరు చనిపోతారు. వాళ్లు చనిపోయినప్పుడు మీరు అనుకున్న వాళ్లకే రికమండేషన్ చేసి పంపిస్తాం‘ అని చెప్పేవాళ్లు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల సంఖ్య కేవలం 16 లక్షలు. ఆ తర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. అవ్వాతాతలకు పెద్దకొడుకులా నిలబడ్డారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లు ఏకంగా 78 లక్షలకు తీసుకొని పోయారు. అవ్వా తాతలకు ఒక్కపూట కూడా భోజనం పెట్టకపోతే మన బతుకు ఎందుకు అనుకున్నాడు. రూ.70 ఇచ్చే పెన్షన్‌ను రూ.200 పెంచి ఆ అవ్వాతాతల గుండెల్లో కొలువయ్యాడు. అదీ రామరాజ్యం అంటే. అలాగే విద్యార్థుల గురించి ఆలోచించారు. ప్రతి పేదవాడు ఇంజనీరు, డాక్టర్, కలెక్టర్ వంటి గొప్పగొప్ప చదువులు చదవాలని కలలు కన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చి వారికి అండగా నిలిచారు. పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు, రైతన్నలు, చిన్నపిల్లల వరకు కులాలు, ప్రాంతాలకు అతీతంగా మేలు చేశారు. అందుకే ఆయన పాలన సువర్ణయుగం అయింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు వీళ్లు చేస్తున్న అన్యాయాలు, కుళ్లుకుతంత్రాలు ఊరికే పోవు.. పై నుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో 30 పైచిలుకు ఎంపీ స్థానాలను మనమే గెల్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం’’
యాత్ర సాగిందిలా..: శనివారం ఉదయం తిరువణంపల్లె నుంచి బయల్దేరిన జగన్ కాణిపాకం చేరుకున్నారు. శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఎల్.బీ.పురం, ఐరాల క్రాస్, ద్వారకాపురం, మారేడుపల్లె, ఉత్తర బ్రాహ్మణపల్లె వరకు రోడ్ షో నిర్వహించారు. తవణంపల్లెలో జగన్ కాన్వాయ్ దిగి మహిళలు, అభిమానులతో మాట్లాడారు. అక్కడ్నుంచి మట్టపల్లె, ముత్యాలమిట్ట, దిగువ తడకర గ్రామాల మీదుగా మత్యం క్రాస్ చేరుకొని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ దారిలో రైతులతో మాట్లాడారు.
మత్యంలో చర్చికి వెళ్లి మత పెద్దల ఆశీర్వచనం తీసుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. అరగొండ చేరుకొని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత రాత్రి బసకు పార్టీ నేత ఎ.ఎస్.మనోహర్ ఇంటికి చేరుకున్నారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సంక్రాంతి తర్వాత నాలుగో విడత
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర నాలుగో విడత సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. మూడో విడత పర్యటన ఆదివారంతో పూర్తి కానుందని చెప్పారు.
పేదోడి గుండెచప్పుడు వినాలి..
ఈరోజు కుళ్లు, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతున్నారు. చదరంగం ఆడుతున్నట్టుగా ప్రాంతాలను విడగొట్టడం, ఒక మనిషిని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టడం, ఒక మనిషిని తప్పించడం.. ఇవి కావు రాజకీయాలంటే. రాజకీయాలంటే విశ్వసనీయత అంటే అర్థం తెలిసి ఉండటం. ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినడం. అతడి మనసు తెలుసుకోవడం. ఆ పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవడం.