సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి సవరణలు, సలహాలు, సూచనలు ప్రతిపాదించలేదు. కీలకమైన ఈ ముగ్గురు నేతల తీరుపై ఆయా పార్టీ నేతల్లో విస్మయం వ్యక్తమైంది. సమన్యాయం చేశాకే విభజన చేయాలంటూ ఢిల్లీలో దీక్ష చేయడమే గాక పది రోజుల పాటు వరుసగా విలేకరుల సమావేశాలు పెట్టి డిమాండ్ చేసిన చంద్రబాబు.. తన డిమాండ్ల మేరకు బిల్లుకు సవరణలు ప్రతిపాదించడానికి అవకాశమున్నప్పటికీ ఆ పని చేయకపోవడాన్ని ఆయన సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న ఉద్దేశంతో టీడీపీకి చెందిన ఆ ప్రాంత నేతలెవరూ సవరణలు ప్రతిపాదించలేదు. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే కోరారు. సీమాంధ్ర టీడీపీ నేతలు మాత్రం సవరణలు కోరగా, బాబు ఏదీ చేయకపోవడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతల్లో సంతోషం వ్యక్తమైంది.
స్పీకర్ ఒక ఫార్మేట్ రూపొందించి విభజన బిల్లు, దానిలోని క్లాజులపై లిఖితపూర్వకంగా సవరణలు అందజేయాలని కోరిన విషయం తెలిసిందే. కానీ బిల్లుపై ఎలాంటి సవరణలు ప్రతిపాదించని బాబు, రేపటి రోజున క్లాజులపై ఓటింగ్ కోరడానికి నైతికంగా అవకాశాన్ని కోల్పోయినట్టు అయిందని సీమాంధ్ర టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. సవరణలు కోరకపోవడమంటే బిల్లును బాబు యథాతథంగా ఆమోదించినట్టేనని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక విభజన బిల్లు సభలో తాను ప్రతిపాదించకుండా గైర్హాజరై, అప్పటి సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా ప్రవేశపెట్టించిన కిరణ్ కూడా సవరణలను ప్రతిపాదించకపోవడంపై కాంగ్రెస్ నేతల్లో తర్జనభర్జన మొదలైంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున సవరణలను ప్రతిపాదించకూడదని బొత్స నిర్ణయం తీసుకున్నా, ఆయన తీరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
ఆ ముగ్గురు ఎటో!
Published Sat, Jan 11 2014 2:26 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement